తెదేపా అధినేత చంద్రబాబుపై శాసనసభలో అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ..పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. గుంటూరు జిల్లాల్లోని ప్రధాన కూడళ్లలో తెదేపా శ్రేణులు ధర్నా చేపట్టాయి. సత్తెనపల్లి తాలుకా సెంటర్‌లో తెదేపా ఆందోళన చేపట్టింది. దీంతో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పలువురు కార్యకర్తలను పోలీసులు స్టేషన్కు తరలించారు. తుళ్లూరులోనూ తెదేపా కార్యకర్తలు ఆందోళన చేపట్టి..ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నెల్లూరు జిల్లా బాలాయపల్లిలో రోడ్డుపై మోకాళ్లపై కూర్చుని తెదేపా నేతలు నిరసన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట, కడియం, ఉప్పలగుప్తం,గొల్లపల్లిలోనూ తెలుగు తమ్ముళ్లు ఆందోళన చేపట్టారు. కొత్తపేటలో నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని పార్టీ కార్యక్తరలు నిరసన వ్యక్తం చేశారు.
పశ్చిగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం ఎర్రంపేటలో తెదేపా నేతల ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి, వైకాపా నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జంగారెడ్డిగూడెంలో నాగేశ్వరరావు అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. పక్కనే ఉన్న కార్యకర్తలు ఆయనను ఆసుపత్రికి తరలించారు. అనంతపురం జిల్లాలోనూ ఇద్దరు పార్టీ కార్యకర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. బాధితులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. అంతకు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదర్ వారిని పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు సూచించారు.