పార్టీ కార్యాలయాలతోపాటు పార్టీ నేత పట్టాభి ఇంట్లో విధ్వంసానికి పాల్పడటంపై.. తెలుగుదేశం పార్టీ తీవ్రంగా మండిపడింది. రాష్ట్ర రాజకీయాల్లో వైకాపా ప్రభుత్వం కొత్త సంస్కృతి తీసుకొచ్చిందని నేతలు ధ్వజమెత్తారు. పార్టీ కార్యాలయాలపై వైకాపా దాడులను నిరసిస్తూ.. గుంటూరు జిల్లా నరసరావుపేటలో కార్యకర్తలు ధర్నాకు(tdp protest against the ycp attacks) దిగారు. వినుకొండలో ర్యాలీ చేశారు. కార్యాలయాలపై దాడికి పాల్పడిన వారిని శిక్షించాలని మంగళగిరి తెలుగుదేశం కార్యకర్తలు డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటూ చిలకలూరిపేటలో రహదారులను దిగ్భందించారు. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం, అమలాపురంలో తెలుగుదేశం నేతలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కార్యాలయాలపై దాడికి పాల్పడినవారిని శిక్షించాలంటూ... రాజోలులో గొల్లపల్లి సూర్యారావు ఆధ్వర్యాన కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో తెలుగుదేశం నేతలు కళ్లకు నల్లరిబ్బన్లు కట్టుకొని నిరసన తెలిపారు. నిందితులను శిక్షించాలంటూ ఒంగోలులో అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.
వైకాపా దాడులకు నిరసనగా నెల్లూరులో తెలుగుదేశం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. వైకాపా, తెదేపా వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురంలో ఆందోళనకు దిగిన చంద్రదండు అధ్యక్షుడు ప్రకాశ్ నాయుడుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కనుసన్నల్లోనే వైకాపా దాడులకు పాల్పడుతోందని సీనియర్ నేతలు పల్లె రఘునాథరెడ్డి, ప్రభాకర్ చౌదరి ఆరోపించారు. విశాఖ జిల్లా హుకుంపేటలో కార్యకర్తలు కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ తెలుగుదేశం నేతల నిరసనలు జరిగాయి.
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడిని తెలంగాణ తెలుగుదేశం నేతలు తీవ్రంగా ఖండించారు. వైకాపా ప్రభుత్వాన్ని రద్దు చేసి, రాష్ట్రపతి పాలన విధించాలని పార్టీ నేతలు హైదరాబాద్‌లో డిమాండ్ చేశారు. తెదేపా కార్యాలయాలపై దాడులను నిరసిస్తూ... ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందు ఆందోళన చేపట్టారు.