తెదేపా నేత చింతమనేని ప్రభాకర్‌పై అక్రమ కేసులు పెట్టడం తగదని డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు లేఖ రాశారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై నిరసన వ్యక్తం చేసిన ప్రభాకర్‌పై ఎలా అక్రమ కేసులు పెడతారని లేఖలో పేర్కొన్నారు. దెందులూరులో తహసీల్దార్‌కు వినతిపత్రమిచ్చి, ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే తప్పా..? అని చంద్రబాబు ప్రశ్నించారు. తెదేపా నాయకులపై తప్పుడు కేసులు పెట్టడంపైనే పోలీసుల దృష్టి సారిస్తున్నారన్నారు. విశాఖలో వివాహ వేడుకకు హాజరైతే అశాస్త్రీయంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. నిరసన ద్వారా అసమ్మతిని వ్యక్తం చేయడం చట్టవిరుద్ధమా అని ప్రశ్నించారు.
అసమ్మతులు ఉంటే వేధిస్తారా...?
రాష్ట్రంలో అధికార వైకాపా ప్రేరేపిత పోలీసు రాజ్యం కనిపిస్తోందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో వరసగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలతో ప్రజలు నిరంతరం భయం, అభద్రతతో జీవిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. రాబోయే రోజులకు.. పోలీసుల ప్రస్తుత పనితీరు బ్లాక్ మార్క్‌గా ఉంటుందని చంద్రబాబు అన్నారు. ప్రతిపక్ష నాయకులను బెదిరించే ప్రయత్నాలు తగదని డీజీపీకి రాసిన లేఖలో ప్రస్తావించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏవైనా అసమ్మతులు ఉంటే వేధిస్తారా? అని ప్రశ్నించారు.
కేసులను ఉపసంహరించుకోవాలి...
ప్రజలతో పాటు ప్రతిపక్ష నాయకులనూ పోలీసుల విభాగం వేధిస్తోందని, వారిని చట్టవిరుద్ధంగా గృహ నిర్బంధాలు చేస్తున్నారని పేర్కొన్నారు. తప్పుడు కేసులతో నిర్బంధించి వేధిస్తున్నారని డీజీపీ దృష్టికి తీసుకువెళ్లారు. అక్రమ నిర్బంధాలు, అరెస్టుల ద్వారా ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్య హక్కులకు విరుద్ధంగా చర్యలు ఉంటున్నాయన్న చంద్రబాబు... తెదేపా నాయకులపై తప్పుడు కేసులు పెట్టడంపైనే పోలీసుల దృష్టి సారిస్తున్నారని చెప్పారు. ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే చర్యలు మానుకుని, తెదేపా నాయకులపై పెట్టిన తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
నారా లోకేశ్...
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంతగా దిగజారిపోయిందో చెప్పడానికి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్టు ఉదంతం ఉదాహరణగా చెప్పవచ్చని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఆయనను ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యకర్త ఇంట కార్యక్రమానికి హాజరవ్వడానికి వెళ్లిన చింతమనేనిని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, గంజాయి అక్రమ రవాణా జరిగే ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరిగినందుకు అరెస్ట్ చేశామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్న కొంతమంది పోలీసులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.
ఇదీచదవండి.