రాజకీయాలకు నూతన నిర్వచనం ఇచ్చి, కోట్లాది జీవితాలలో వెలుగు నింపిన మహనీయుడు ఎన్టీఆర్ అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కొనియాడారు. బడుగు బలహీనవర్గాల వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన సమతావాదని అన్నారు. పేదలకు ఆహారభద్రత, నివాస భద్రత, కట్టుకోవడానికి మంచి వస్త్రం అందించిన సంక్షేమ పాలనకు ఆద్యుడని చంద్రబాబు అన్నారు.
తెలుగువారి ఆత్మగౌరవాన్ని, కీర్తిని ప్రపంచానికి చాటిన నందమూరి తారకరామారావు దూరమై 25 సంవత్సరాలు అయినా... ఆ విశ్వవిఖ్యాతుడు మన కళ్ళముందే కదలాడుతున్నట్టు ఉందన్నారు. తెలుగునాట రామరాజ్యాన్ని తిరిగి నెలకొల్పడమే ఎన్టీఆర్ కు మనం అందించే అసలైన నివాళని చంద్రబాబు పిలుపునిచ్చారు.
లోకేష్ నివాళులు..
సామాన్య రైతుబిడ్డగా పుట్టి.. వెండితెర దేవుడై వెలిగి.. మనిషి ఎదగడానికి పట్టుదల, కృషి ఉంటే చాలని ఎన్టీఆర్ నిరూపించారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. అరవై ఏళ్ళ వయసులో రాజకీయాల్లోకి వచ్చి సంచలన విజయాలతో, సంక్షేమ పాలనతో చరిత్ర సృష్టించి ఏదైనా సాధించడానికి వయసుతో పనిలేదని, చిత్తశుద్ధి ఉంటే చాలని నిరూపించారని కొనియాడారు.
మహిళలకు ఆస్తిహక్కు కల్పించినా, బడుగు బలహీన వర్గాలకు పాలనాధికారాలు అప్పచెప్పినా, పేదలకు వినూత్న సంక్షేమ పథకాలు అందించినా సమ సమాజ స్థాపనే ఎన్టీఆర్ లక్ష్యమని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ కీర్తిశేషులై 25 ఏళ్ళు అయ్యాయంటే నమ్మశక్యంగా లేదని, ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆ మానవతావాది ఆశయసాధనకు పునరంకితమవుదామని లోకేష్ పిలుపునిచ్చారు.
ఇవీ చూడండి:
నాగార్జునసాగర్‌లో నీటి చౌర్యం... నిద్రావస్థలో యంత్రాంగం