Chandrababu Fire on YSR Congress Party Ruling : ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విఫలమయ్యారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. మాట తప్పను, మడమ తిప్పనని మాట్లాడే జగన్ .. ప్రతి విషయంలోనూ యూటర్న్ తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ‘ప్రత్యేక హోదా సాధించలేకపోతే రాజీనామా చేస్తానన్న ఆయన.. ఇప్పుడు భాజపాకు పూర్తి మెజారిటీ ఉందంటున్నారు. ఇది మోసం, దగా కాదా? చిత్తశుద్ధి ఉంటే వైకాపా ఎంపీలతో రాజీనామా చేయించండి. తెదేపా ఎంపీలూ రాజీనామా చేస్తారు. అంతా కలిసి పోరాడదాం. ప్రత్యేక హోదా సాధిద్దాం. ఈ సవాల్‌కు సిద్ధమా?’ అని ప్రశ్నించారు. శనివారం తెదేపా కార్యాలయంలో చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. ‘తెదేపా అధికారంలో ఉన్న చివరి రోజుకు రాష్ట్రంలో అన్ని రకాల అప్పులు కలిపి రూ.3.14 లక్షల కోట్లుంటే.. రెండున్నరేళ్లలో దాన్ని రూ.7 లక్షల కోట్లకు చేర్చారు. ప్రభుత్వ ఆస్తులు అమ్ముతున్నారు. కలెక్టరేట్లు తాకట్టు పెడుతున్నారు. నిధులివ్వకపోవడంతో ఆసుపత్రుల్లో రోగులకు భోజనం లేదు. మందులు లేవు. చిన్నపిల్లలకు పోషకాహారం లేదు. మధ్యాహ్న భోజనం లేదు’ అని దుయ్యబట్టారు. ‘ఎన్టీఆర్ హయాంలో ఇచ్చిన ఇళ్లకూ కప్పం కట్టాలా? ధైర్యం ఉంటే ఏ ఊరికైనా రండి.. బలవంతంగా ఓటీఎస్ చేస్తున్నారని నిరూపిస్తా’ అని సవాల్ విసిరారు. ‘తెదేపా హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చాం. అధికారంలోకి వచ్చి మూడో ఏడాదైనా మీ ప్రభుత్వం ఎందుకివ్వలేదు? సీపీఎస్ సమస్యను వారంలో పరిష్కరిస్తామన్న మీ హామీ ఏమైంది?’ అని నిలదీశారు. ‘తడిసిన ధాన్యానికి క్వింటాలుకు రూ.వెయ్యి వస్తోంది. వరి వేసేందుకు కౌలు రైతులు ముందుకు రావడం లేదు’ అని విమర్శించారు. ఎన్నికల ముందు, అధికారంలోకి వచ్చాక జగన్ వ్యాఖ్యల వీడియో క్లిప్పింగులను ప్రదర్శిస్తూ.. పలు ప్రశ్నలు సంధించారు.
హోదాపై జగన్ ఏమన్నారంటే
ఎన్నికలకు ముందు: 25కి 25మంది ఎంపీలు ఒక్కతాటిపై నిలబడి రాజీనామాలు చేసి, నిరాహారదీక్షకు కూర్చుంటే దేశం మొత్తం మనవైపు ఎందుకు చూడదో చూస్తాం.. కేంద్రం ఎందుకు దిగిరాదో చూస్తాం.
ఎన్నికల తర్వాత: కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం లేదు కాబట్టి.. అక్కడున్న ప్రభుత్వానికి లోక్‌సభలో పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి.. ప్రత్యేక హోదాపై పదే పదే అడగడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం.
దీనిపై చంద్రబాబు ఏమన్నారంటే: రాష్ట్రంలో యువత దీన్ని అర్ధం చేసుకోవాలి. 25 ఎంపీ స్థానాలిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని, ఆంధ్రప్రదేశ్‌కు అదే సంజీవని అని, అందరికీ ఉద్యోగాలొస్తాయని, ఒంగోలు లాంటి నగరం హైదరాబాద్‌లా తయారవుతుందని జగన్ చెప్పారు. ఇప్పుడేమో లోక్‌సభలో భాజపాకు మెజారిటీ ఉందంటున్నారు. మేం భాజపాతో కలిసి ఉన్నప్పుడూ వారికి సొంతంగా మెజారిటీ ఉంది. కానీ కేంద్రంలో మా మంత్రులతో రాజీనామా చేయించి పోరాడాం. మీరెందుకు అలా చేయరు?
రైల్వేజోన్‌పై...
ఎన్నికల ముందు: ప్రతి రాష్ట్రానికి రైల్వే జోన్ ఉంది. జోన్ లేని అతి తక్కువ రాష్ట్రాల్లో ఖర్మ కొద్దీ ఆంధ్రప్రదేశ్ ఉంది. పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం విశాఖ రైల్వేజోన్ ఇవ్వాలి. మనకంటూ జోన్ ఉంటే.. ఉద్యోగార్థులు తలెత్తుకుని పోయి రైల్వే రిక్రూట్‌మెంట్ పరీక్షలు రాయగలుగుతారు. అది లేకనే పరీక్షలకు ఒడిశా, ఇతర రాష్ట్రాలకు పోతే తరిమికొట్టి పంపిస్తున్నారు. దీనిపై కలిసికట్టుగా పోరాడదాం.
చంద్రబాబు ఏమన్నారంటే: ముఖ్యమంత్రి జగన్ దీనికి సమాధానం చెప్పాలి. 17 రైల్వే జోన్లు ఉన్నాయని, విశాఖపట్నం పరిశీలనలో లేదని కేంద్ర మంత్రి మాట్లాడుతుంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. రాజధాని చేస్తామంటూ విశాఖపట్నంపై ప్రేమ చూపిస్తున్నారు. కానీ అక్కడికి రావాల్సిన రైల్వే జోన్ పోయిందని విశాఖపట్నం, పరిసర ప్రాంతాల యువత అర్ధం చేసుకోవాలి.