చంద్రబాబుకి పేరొస్తుందనే ఉద్దేశంతోనే గత ప్రభుత్వ హయంలో ప్రారంభమైన ఇళ్లను జగన్ రద్దు చేశారని టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు విమర్శించారు. 90 నుంచి 100శాతం పూర్తైన 2,62,216 ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించడానికి జగన్ ప్రభుత్వానికి మనస్సు రావటం లేదన్నారు. తెదేపా ప్రభుత్వ హయంలో పూర్తైన ఇళ్లతో పాటు, ఇళ్లస్థలాలను డిసెంబర్ 25న ఉచితంగా ఇస్తామని జగన్ చెప్పటం లబ్ధిదారులను మోసగించటమేనని మండిపడ్డారు.
300, 360, 430చదరపు అడుగుల్లో నిర్మించిన ఇళ్లన్నింటినీ.. బ్యాంకు రుణాలతో సంబంధం లేకుండా ఉచితంగానే లబ్ధిదారులకు అందిస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలోనే చెప్పారని ఆయన గుర్తుచేశారు. నేడు జగన్ 300 చదరపు అడుగుల్లో నిర్మితమైన వాటినే రూపాయికి ఇస్తామంటూ మరో కొత్త నాటకం మొదలుపెట్టారని దుయ్యబట్టారు. రూపాయికే ఇల్లు అంశాన్ని 360, 430 చదరపు అడుగుల ఇళ్లకు ఎందుకు వర్తింపచేయటంలేదని నిమ్మల ప్రశ్నించారు.