ఉపాధిహామీ నిధులు వెంటనే విడుదల చేయాలి : ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల నిధులు కేంద్రం మంజూరు చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా విడుదల చేయకపోవడం దారుణమని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ సంఘాల ముఖ్య నాయకుల సమావేశాన్ని విజయవాడలో నిర్వహించారు. ఈ సమావేశానికి 13 జిల్లాల ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశంలో ఉపాధి హామీ నిధుల విడుదల, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశాలపై చర్చించారు. ఉపాధి హామీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలకు కేటాయిస్తుందని ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. నిధులను తక్షణమే విడుదల చేయాలన్న ఆయన... అక్టోబర్ 30వ తేదీన అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేస్తామన్నారు. నవంబర్ మొదటివారంలో చలో అమరావతి కార్యక్రమం చేపడతామని రాజేంద్రప్రసాద్ తెలిపారు. నిధులు విడుదల చేసే వరకు తమ ఉద్యమం కొనసాగిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే... నవంబర్ రెండవ వారంలో 'చలో దిల్లీ' కార్యక్రమం చేపడతామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి :