వైకాపా ప్రభుత్వం అమలు చేస్తున్న 'బీసీల కోసం జగనన్న మోసం' కార్యక్రమం పనితీరు బాగుందని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఎద్దేవా చేశారు. 16 నెలల వైకాపా పాలనలో బీసీలను మోసం చేయడం తప్ప మరేం చేశారో ఆ పార్టీ నేతలు చెప్పాలని సవాల్ విసిరారు. వైకాపా ప్రభుత్వం వెనుకబడిన కులాల వెన్నెముక విరుస్తోందని ధ్వజమెత్తారు.
బీసీలకు ప్రభుత్వం ఏం చేసిందనే దానిపై బహిరంగ చర్చకు వచ్చే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. బీసీల సంక్షేమానికి 2020-21 బడ్జెట్‌లో కాంపోనెంట్ ద్వారా రూ. 25,331.30 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించి.. ఆ సొమ్ములో దాదాపు 95 శాతం నిధుల్ని నవరత్నాల కోసం మళ్లించారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా సంక్షేమం పేరుతో చేస్తున్న మోసాన్ని, మోసపూరిత ప్రకటనలను మానుకోవాలని అనగాని హితవు పలికారు.