ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేడు తెదేపా మహానాడు... పసుపు దళంలో నూతనోత్సాహం

తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ మహానాడు... బుధవారం ప్రారంభం కానుంది. అధినేత చంద్రబాబు పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో తారక రాముడి విగ్రహానికి నివాళులర్పించి జెండా ఆవిష్కరణతో వేడుకను లాంఛనంగా ప్రారంభించనున్నారు. తొలి రోజు ఏపీకి సంబంధించి 8, తెలంగాణకు సంబంధించి 2 కలిపి మొత్తం పది తీర్మానాలను మహానాడు వేదికగా ఆమోదించనున్నారు. రెండు తెలుగురాష్ట్రాలకు సంబంధించి మొత్తం 20 తీర్మానాలను ఈసారి మహానాడులో ఆమోదించనున్నారు. కరోనా ప్రభావంతో మహానాడు ఈసారి డిజిటల్ సొగబులు సొంతం చేసుకుంది.

నేడు తెదేపా మహానాడు...పసుపు దళంలో నూతనోత్సాహం !
నేడు తెదేపా మహానాడు...పసుపు దళంలో నూతనోత్సాహం !

By

Published : May 27, 2020, 12:09 AM IST

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే మహానాడు ఈసారి కరోనా ప్రభావంతో డిజిటల్ సొగబులు సొంతం చేసుకుంది. పార్టీ కుటుంబ వేడుకగా జరిగే ఈ కార్యక్రమాన్ని బుధ, గురువారాల్లో ఆన్​లైన్ వేదికగా నిర్వహించనున్నారు.

డిజిటల్ ఆహ్వానాలు ...

అధినేత చంద్రబాబు ప్రతి ఒక్కరికీ డిజిటల్ ఆహ్వానాలు పంపారు. మహానాడులో పాల్గొనేందుకు అనుసరించాల్సిన విధానాలపై ఇందులో సూచనలు చేశారు. ప్రతి కార్యకర్త మొబైల్‌ ఫోన్‌ లేదా ట్యాబ్‌లో జూమ్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని సూచించారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పంపిన లింక్‌ను ట్యాప్‌ చేసి స్క్రీన్‌ నేమ్‌ వద్ద పేరు, ‘జీమెయిల్‌’ వద్ద mahanadu@tdp.com అని టైప్‌ చేసి మహానాడులో చేరాలని పిలుపునిచ్చారు.

వర్చువల్‌ మీడియా వేదికగా...

ఈసారి మహానాడును మాత్రం ప్రతిసారీ నిర్వహించే భారీ బహిరంగసభలా కాకుండా.. వర్చువల్‌ మీడియా వేదికగా నిర్వహిస్తున్నారు. వర్చువల్ మహానాడులో మొత్తం 52 మంది నేతలు మాట్లాడతారు. ఒకేసారి 14వేల మందితో ఈ సారి మహానాడు ఆన్​లైన్​లో జరగనుంది. ఆన్​లైన్​లో తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు పదిహేను వందలమంది పాల్గొంటుండగా... ఎన్​ఆర్ఐ విభాగం ప్రతినిధులు, ఇతర దేశాల నుంచి ఈ వేడుకలో పాల్గొంటారు. 25 వేలమంది కార్యకర్తలతో వర్చువల్ మహానాడును ఏర్పాటు చేశారు. తెలుగుదేశం కార్యకర్తలందరూ మహానాడును జయప్రదం చేయాలని నేతలు కోరారు.

పలు కీలక తీర్మాణాలు...

మహానాడు వేదికగా వైకాపా ఏడాది పాలనను ఎండగట్టడమే లక్ష్యంగా పలు కీలక తీర్మానాలు చేయనున్నారు. కూల్చివేతలు, పథకాల రద్దులు, రంగులు, వాలంటీర్లు, ప్రజాధనం దుబారా, కుంభకోణాలు, రాజ్యాంగ విరుద్ధంగా శాసనమండలి రద్దు, ఎన్నికల కమిషనర్ తొలగింపు, ప్రజాస్వామ్యం ఖూనీ, నామినేషన్ పదవుల్లో మంట కలిసిన సామాజిక న్యాయం, కరోనా వ్యాపకులుగా వైకాపా నేతలు, ప్రాంతీయ విధ్వేషాలు, యూనివర్సిటీ పాలక మండళ్లు, వీసీల నియామకాల్లో వివక్షత వంటి అంశాలు చర్చకు వచ్చేలా ఏపీ తీర్మానాలను రూపొందించారు.

నేరగాళ్ల రాజ్యంగా ఆంధ్రప్రదేశ్- అశాంతి, అభద్రత-హింసా విధ్వంసాల పేరిట ప్రవేశ పెట్టే తీర్మానాన్ని పార్టీ కీలకంగా భావిస్తోంది. జగన్ ఏడాది పాలనలో అరాచకం వికృతరూపం దాల్చిందనే సందేశాన్ని ఈ తీర్మానం ద్వారా ఇవ్వనున్నారు. హింసా విధ్వంసాలు చెలరేగిపోవటంతో పాటు వేధింపులు-బెదిరింపులు, దాడులు-దౌర్జన్యాలకు హద్దు అదుపు లేకుండా పోయిందని ధ్వజమెత్తతూ తీర్మానంలో అనేక అంశాలను జోడించారు. అశాంతి, అభద్రతలకు నెలవుగా రాష్ట్రం మారిందని ఆరోపించటంతో పాటు ధన, మాన, ప్రాణాలకు రక్షణ కరువై భయం గుప్పెట్లో జనం బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారనే సందేశాన్ని తీర్మానం ద్వారా ఆమోదించనున్నారు. పారిశ్రామిక వేత్తలను బెదిరించి రాష్ట్రం నుంచి తరిమేయటంతో పాటు మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నది తెలుగుదేశం ఆరోపణ. ఆంధ్రప్రదేశ్​ను అరాచకప్రదేశ్​గా మార్చేశారని ఈ తీర్మానం ద్వారా చాటాలన్నది తెలుగుదేశం యోచన.

వైకాపా ఏడాది పాలను ఎండగట్టమే లక్ష్యంగా..

ఉదయం 11 గంటలకు పార్టీ కార్యాలయానికి రానున్న చంద్రబాబు జెండా ఆవిష్కరించి మా తెలుగుతల్లి గీతాలాపనలో పాల్గొంటారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం మరణించిన పార్టీ కార్యకర్తలు, నాయకులకు సంతాపం ప్రకటించనున్నారు. ఇటీవల ఎల్జీ పాలిమర్స్‌ ఘటనలో మృతి చెందిన వారికి మరో సంతాప తీర్మానం ఉంటుంది. అనంతరం ఒక్కొక్కరిది ఐదేసి నిమిషాల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుల ప్రసంగాలు ఉంటాయి. అనంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మహానాడు ప్రసంగం ఇస్తారు. ఆ తరువాత అరాచక పాలనకు ఏడాది-ప్రమాదంలో ప్రజాస్వామ్యం పేరిట మొదటి తీర్మానాన్ని ప్రవేశపెడతారు. అన్నదాత వెన్ను విరిచిన జగన్‌ సర్కార్‌ పేరిట రెండో తీర్మానం ప్రవేశపెట్టనుండగా విద్యుత్‌ ఛార్జీల పెంపు - మాట తప్పిన జగన్‌ పేరిట అదనపు తీర్మానం ఉండనుంది.

భోజన విరామం అనంతరం సాయంత్రం 4గంటలకు పది నిమిషాల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. సంక్షోభంలో సాగునీటి ప్రాజెక్టులు - తనవారికి కట్టబెట్టేందుకే పోలవరాన్ని రెండేళ్లు వెనక్కినెట్టారు - డ్యాం భద్రతకు చేటు తెచ్చారు పేరిట మూడో తీర్మానం ప్రవేశపెట్టనుండగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వ్యవసాయ రంగంపై మొదటి తీర్మానం చేయనున్నారు. అక్రమ ఆస్తులు - ఆస్తుల విధ్వంసం - పోలీస్‌ వ్యవస్థ దుర్వినియోగం పేరిట ఆంధ్రప్రదేశ్‌ కు సంబంధించిన నాలుగో తీర్మానాన్ని ప్రవేశపెట్టనుండగా ప్రజారాజధాని అమరావతి - మూడు ముక్కలాటలో రాష్ట్రాభివృద్ధి అధోగతి పేరిట ఐదో తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సాగునీటి ప్రాజెక్టులపై రెండో తీర్మానం ప్రవేశపెడతారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించి ఆరవ తీర్మానంగా బలిపీఠంపై బడుగు సంక్షేమం - 34 పథకాల రద్దు పేరిట ప్రవేశపెట్టనున్నారు. తొలిరోజు చివరగా తితిదే ఆస్తుల అమ్మకంపై అదనపు తీర్మానం ఉంటుంది.

మహానాడు రెండో రోజు

మరుసటి రోజు గురువారం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ జయంతిని పురస్కరించుకుని యుగ పురుషుడికి నివాళి పేరిట ఆ మహానేతకు ఘనంగా నివాళులర్పించనుంది. అనంతరం భూ దురాక్రమణలు - జే ట్యాక్స్‌ - జైలు జీవితం నుండి పాఠాలు నేర్వరా? - చేసిన నేరాలే తిరిగి చేస్తారా? - భారీ అవినీతి పేరిట ఏపీకి సంబంధించి ఏడవ తీర్మానం ప్రవేశపెట్టనుండగా.... ధరల పెంపు - మూడు నాలుగు రెట్లు అధికం - ప్రజలపై 50వేల కోట్ల రూపాయల భారం పేరిట ఎనిమిదో తీర్మానం ఉంటుంది.

తెలంగాణలో ప్రభుత్వ వైఫల్యంపై...

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి విద్య, వైద్య రంగాలపై మూడో తీర్మానం ప్రవేశపెట్టనుండగా ఏపీలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి విచ్ఛిన్నంపై 9వ తీర్మానం ఉంటుంది. ఎల్జీ పాలిమర్స్‌ ఘటనపై అదనపు తీర్మానాన్ని పార్టీ నేతలు ప్రవేశపెట్టనున్నారు. భోజన విరామం అనంతరం పది నిమిషాల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగిన అనంతరం కీలకమైన రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెడతారు. తెరాస వాగ్ధానాలు, వైఫల్యాలపై తెలంగాణకు సంబంధించిన నాలుగో తీర్మానం ఉంటుంది. అనంతరం పార్టీ సంస్థాగత తీర్మానంతో పాటు కరోనా వైరస్‌ విజృంభణ - వలస కార్మికుల కష్టాలపై అదనపు తీర్మానం ఉంటుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఉపన్యాసంతో మహానాడు వేడుక ముగియనుంది.

ABOUT THE AUTHOR

...view details