దేశంలోని అనేక రాష్ట్రాలు పేదలకు సాయం చేస్తుంటే.. వైకాపా ప్రభుత్వం ఎందుకు ముందుకు రావట్లేదని తెదేపా శాసనసభపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు నిలదీశారు. కొవిడ్ సంక్షోభంలో చిక్కుపోయిన ప్రజల 10 డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. పేదలకు సాయం చేయకుండా ప్రకటనలకు మాత్రం రూ.వేల కోట్లు ఖర్చు చేస్తోందని ధ్వజమెత్తారు.
ప్రతి తెల్లరేషన్ కుటుంబానికి రూ.10వేలు ఆర్థిక సాయం చేయటంతో పాటు.. కరోనాతో వల్ల చనిపోయిన కుటుంబాలకు రూ.10లక్షలు, కొవిడ్ విధులు నిర్వర్తిస్తూ చనిపోయిన వారికి రూ.50లక్షలు ఇవ్వాలని అన్నారు. ఆక్సిజన్ కొరతతో చనిపోయిన వారికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని.. కరోనాతో చనిపోయిన వారి దహనసంస్కారాలకు రూ.15వేలను ప్రభుత్వం వెంటనే అందచేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల పరిష్కారించకపోతే బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా ఆందోళనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.