ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TDP Protest: చమురు ధరలపై తెదేపా పోరుబాట.. ఎక్కడికక్కడ నేతల అరెస్ట్ - తెదేపా నేతల అరెస్టు

పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై తెలుగుదేశం.. ఆందోళన బాట పట్టింది. ధరలు దిగి రావాలి, జగన్‌ దిగిపోవాలి అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. పాలన చేతగాని ముఖ్యమంత్రి రాజీనామా చేయాలంటూ.. తెదేపా శ్రేణులు డిమాండ్‌ చేశాయి. పలు చోట్ల ఆందోళనలు.. ఉద్రిక్తతతకు దారితీశాయి. అగ్ర నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు.

చమురు ధరలపై తెదేపా పోరుబాట
చమురు ధరలపై తెదేపా పోరుబాట

By

Published : Aug 28, 2021, 8:24 PM IST

Updated : Aug 29, 2021, 4:41 AM IST

చమురు ధరలపై తెదేపా పోరుబాట

పెట్రోలు, ఇతర నిత్యావసరాల ధరల పెంపుపై తెదేపా శనివారం రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించింది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్‌ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన నిరసనల్లో పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. 171 నియోజకవర్గాల్లో ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకొని పాదయాత్రలు, ర్యాలీలు, ధర్నాలను నిర్వహించారు. వాహనాలను తాళ్లతో లాగారు. నీటిలోకి దిగి గ్యాస్‌ సిలిండర్లతో అర్ధనగ్న ప్రదర్శనలు, రోడ్లపై కట్టెల పొయ్యిలతో వంటలు చేశారు. గాడిదలకు విన్నపాలనిచ్చారు. తెదేపా ఆందోళనలను అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ పోలీసులను పెద్దఎత్తున మోహరించారు. రాష్ట్రంలో చాలాచోట్ల ముఖ్య నాయకులకు శుక్రవారం రాత్రే నోటీసులు ఇచ్చారు. కొందరిని గృహనిర్బంధంలో ఉంచారు. శనివారంకూడా పలు చోట్ల పోలీసులు ర్యాలీలను అడ్డుకోవడంతో వారికి, తెదేపా శ్రేణులకు మధ్య వాగ్వాదం, ఘర్షణ వాతావరణం ఏర్పడింది. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి- కొత్తపేట రహదారిపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఆధ్వర్యంలో తలపెట్టిన బైక్‌ ర్యాలీలో పాల్గొనేందుకు భారీగా పార్టీ కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. బైక్‌ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో అచ్చెన్నాయుడు తదితరులు కాలినడకన కోటబొమ్మాళి రైతుబజారు వరకు ప్రదర్శన నిర్వహించారు. పోలీసుల తీరుపై అచ్చెన్నాయుడు మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో తెదేపా 155 స్థానాలు సాధిస్తుందని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమని పేర్కొన్నారు.

పులివెందులలో అష్టదిగ్బంధం

కడప జిల్లా పులివెందులలో తెదేపా ర్యాలీని పోలీసులు అడుగడుగునా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్సీ బీటెక్‌ రవి ఇంటిని దిగ్బంధించారు. పులివెందుల చుట్టుపక్కల ప్రాంతాల్లోకి వచ్చే అన్ని మార్గాల్లోనూ, తెదేపా ర్యాలీ చేపట్టిన మార్గంలోనూ చెక్‌పోస్టులను ఏర్పాటుచేశారు. పులివెందులలో కూడా జగన్‌కు వ్యతిరేకంగా ప్రజలు బయటకు వచ్చి ఉద్యమిస్తే ప్రభుత్వం పరువు పోతుందున్న భయంతోనే చెక్‌పోస్టులతో నిర్బంధిస్తున్నారని బీటెక్‌ రవి మండిపడ్డారు. కడపలో బస్టాండ్‌ నుంచి వన్‌టౌన్‌ వరకు తెదేపా శ్రేణులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించాయి. అనంతపురం జిల్లా బొమ్మనహాళ్‌ మండలంలోని ఉద్దేహాళ్‌ నుంచి బొమ్మనహాళ్‌ వరకు మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు చేపట్టిన పాదయాత్రను పోలీసులు భగ్నం చేశారు. ఆయన్ను అరెస్టు చేసి కణేకల్లు పోలీసుస్టేషన్‌కు తరలించారు. రాయదుర్గం నియోజకవర్గంలో తెదేపా పెద్దఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటుచేయగా.. పోటీగా వైకాపా కూడా ఫ్లెక్సీలు ఏర్పాటుచేయడం వివాదాస్పదమైంది. పాదయాత్రకు అనుమతి లేదని శుక్రవారం రాత్రినుంచే తెదేపా శ్రేణులను పెద్ద ఎత్తున పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉప్పరహాల్‌ క్రాస్‌ వద్ద కాలవ శ్రీనివాసుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం వరకు స్టేషన్‌లో ఉంచారు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో తహసీల్దార్‌కు విన్నపమిచ్చేందుకు వెళుతున్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. నరసరావుపేటలో తెదేపా ఇన్‌ఛార్జి అరవిందబాబు, నేతలను ముందస్తుగా అరెస్టు చేశారు.

నిరసనల హోరు

*శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో చేపట్టిన ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు. పలాస-కాశీబుగ్గల్లో గౌతు శిరీష ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఎచ్చెర్లలో మాజీ మంత్రి కళావెంకట్రావు, కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించారు.

*విశాఖ జిల్లా నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు నేతృత్వంలో ఎడ్లబళ్లు, రిక్షాలు, సైకిళ్లు, సిలిండర్లతో ఆందోళన నిర్వహించారు.

*తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే ఎన్‌.చినరాజప్ప, మండపేటలో ఎమ్మెల్యే జోగేశ్వరరావు ఆందోళనలు చేపట్టారు. కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, కాకినాడ మేయర్‌ పావని ఎడ్లబండిపై కూర్చున్నారు.

*పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌రావు పలు వాహనాలను తాళ్లతో లాగుతూ.. బైక్‌లను రిక్షాపై ఎక్కించి తొక్కుతూ నిరసన తెలిపారు. ఏలూరులో గ్యాస్‌బండలకు పూలదండలు వేశారు.

*విజయవాడ ధర్నాచౌక్‌లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు, బొండా ఉమామహేశ్వరరావు తదితరులు సైకిల్‌ తొక్కారు. మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కోనేరు సెంటర్‌లో ట్రాక్టర్లను తాడుతో కట్టి లాగారు. మాజీ మంత్రి దేవినేని ఉమా.. ఇబ్రహీంపట్నంలో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు.

*గుంటూరు జిల్లా తెనాలిలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, వేమూరులో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగాయి. ద్విచక్రవాహనాన్ని ఎడ్లబండిపై తీసుకెళ్లి పంటకాలువలో వేశారు. బాపట్లలో భావనారాయణస్వామికి కొబ్బరికాయలు కొట్టారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి వేగేశ్న నరేంద్రవర్మకు, సీఐ కృష్ణయ్యకు వాగ్వాదమేర్పడింది. నరేంద్రవర్మతో పాటు మరో 9మంది అరెస్టయ్యారు.

*నెల్లూరు వీఆర్‌సీ సెంటర్‌లో పార్టీ లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌ఛార్జి అబ్దుల్‌అజీజ్‌ ఆధ్వర్యంలో గాడిదకు విన్నపమిచ్చారు. నాయుడుపేటలో 50 ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయంలో విన్నపమిచ్చారు. వెంకటాచలం సమీపంలోని జాతీయ రహదారిపై ఆందోళన నిర్వహించారు. గూడూరులో పార్టీ నేతలు బీద రవిచంద్రయాదవ్‌, సునీల్‌కుమార్‌ల ఆధ్వర్యంలో ఎడ్లబళ్లతో ప్రదర్శన నిర్వహించారు.

*ప్రకాశం జిల్లా ఒంగోలులో మాజీ ఎమ్మెల్యే దామరచర్ల జనార్దన్‌ నేతృత్వంలో ప్రదర్శన నిర్వహించారు. పర్చూరు, ఇంకొల్లులోనూ నిరసనలు కొనసాగాయి.

*కర్నూలు జిల్లా కోడుమూరులో బైక్‌కు ఉరివేశారు. సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గౌరు వెంకటరెడ్డి, చరితరెడ్డి పాల్గొన్నారు. బనగానపల్లె నియోజకవర్గంలో బీసీ జనార్దన్‌రెడ్డి నేతృత్వంలో నిరసనలు జరిగాయి.

*చిత్తూరు జిల్లా పలమనేరులో మాజీ మంత్రి అమరనాథరెడ్డి ర్యాలీ నిర్వహించారు. కుప్పం బస్టాండ్‌ కూడలి, చంద్రగిరి క్లాక్‌టవర్‌ల వద్ద ధర్నాలు చేశారు. మదనపల్లెలో మాజీ ఎమ్మెల్యే డి.రమేశ్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

*విజయనగరం జిల్లా పార్వతీపురం, సాలూరులలో నిరసనలు కొనసాగాయి.

ఇదీ చదవండి:

ఆంగ్లం మోజులో తెలుగును నిర్లక్ష్యం చేయడం తగదు: సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

Last Updated : Aug 29, 2021, 4:41 AM IST

ABOUT THE AUTHOR

...view details