వైకాపా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తెలుగుదేశం ముఖ్యనేతలపై నమోదైన వరుస కేసులను ఆ పార్టీ అధిష్ఠానం తీవ్రంగా పరిగణిస్తోంది. కొందరు పోలీసు అధికారులు.. ప్రభుత్వ పెద్దలతో కుమ్మక్కై అక్రమ కేసులు పెడుతున్నారని తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నారు. రానున్న రోజుల్లో అలాంటి వారిని చట్టపరంగా ఎదుర్కొనేందుకు..వారిపై ప్రైవేటు కేసులు పెట్టేందుకు పార్టీ న్యాయ విభాగాన్ని బలోపేతం చేసేలా అధినేత చంద్రబాబు చర్యలు ముమ్మరం చేశారు. జిల్లాల వారీగా పార్టీ ముఖ్యనేతలపై నమోదైన కేసుల వివరాలపై చంద్రబాబు సమీక్షిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడుపై అనేక కేసులు నమోదయ్యాయి. అదే జిల్లాకు చెందిన పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు పై రామతీర్థం ఘటనలో కేసు నమోదుతోపాటు.. అరెస్టు చేసి బెయిల్ పై విడిచిపెట్టారు. ఇదే అంశానికి సంబంధించి అధినేత చంద్రబాబుపైనా కేసు నమోదైంది. శ్రీకాకుళం జిల్లాలోని మరో సీనియర్ నేత కూన రవికుమార్‌పై వరుసగా కేసులు పెట్టారు. విశాఖ జిల్లాలో లేటరైట్ మాటున బాక్సైట్ తవ్వకాలు జరుగుతున్నాయంటూ క్షేత్రస్థాయి పర్యటన కు వెళ్లిన అయ్యన్నపాత్రుడు, చినరాజప్ప, నక్కా ఆనంద్ బాబు, అనితపైనా కేసులు నమోదు చేశారు.
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి హత్యానేరం కింద అరెస్టై.... బెయిల్ పై బయటకు వచ్చారు. ఓ వివాహ వేడుకకు హాజరైన అంశంపై ఇదే జిల్లాలో శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు, చినరాజప్పతో పాటు మరికొందరు నేతలపైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. పశ్చిమ గోదావరి జిల్లాలో చింతమనేని ప్రభాకర్ పై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని అధిష్ఠానం భావిస్తోంది. కృష్ణా జిల్లాలో దేవినేని ఉమ అరెస్టు, జైలుకు పంపడాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ఇదే జిల్లాకు చెందిన మాజీమంత్రి కొల్లు రవీంద్రపైనా అనేక కేసులు పెట్టారు. గుంటూరు జిల్లాలో సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర సంగం డెయిరీ కేసులో అరెస్టై.. బెయిల్ పై బయటకు వచ్చారు. మరోనేత ఆలపాటి రాజాపైనా ఇటీవల వివిధ అంశాలపై కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డిపైనా కేసులున్నాయి. చిత్తూరు జిల్లాలో తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికల ప్రచార సమయంలో లోకేశ్‌తోపాటు.. పలువురిపై నా పోలీసులు కేసులు పెట్టారు.