Atchannaidu on CM Jagan: జగన్ రెడ్డి పాలనలో ఆక్వా రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. అత్యధిక ఆదాయం, ఉపాధి కల్పించే ఆక్వారంగంపై జగన్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఆక్వా విద్యుత్ రాయితీలను తక్షణమే పునరుద్ధరించి ఛార్జీల భారాన్ని తగ్గించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. తెలుగుదేశం హయాంలో తగ్గించిన ఆక్వా విద్యుత్ ఛార్జీలను ఇప్పుడు రెట్టింపు చేశారని మండిపడ్డారు. ఇప్పటికే విద్యుత్ కోతలు, పవర్ హాలిడే నిర్ణయాలతో ప్రాసెసింగ్ కంపెనీలు రొయ్యల ధరలు తగ్గించాయని ఆక్షేపించారు. జగన్ రెడ్డి రాయితీలు ఎత్తేస్తూ తీసుకున్న అసమర్థ నిర్ణయంతో ఆక్వా రైతులు అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉందన్నారు. ఆక్వా రైతులకు మేలు చేయకపోగా.. వారిపై ఛార్జీల భారం మోపారని మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీల పెంచి ఆక్వారంగాన్ని పట్టపగలు ఉరితీశారని దుయ్యబట్టారు.
Kollu Ravindra on YSRCP: జగన్ ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేస్తోందని తెదేపా నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. తితిదే, ఏపీఐఐసీ లాంటి నామినేటెడ్ పోస్టులను తెదేపా హయాంలో బీసీలకు ఇచ్చినట్లు ఆయన గుర్తుచేశారు. కార్పొరేషన్లు ఉన్నా.. వాటికి నిధులు లేవని, మంత్రిపదవులు ఉన్నా.. వారికి ఎలాంటి అధికారాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కర్నూలులో మీడియాతో మాట్లాడారు. మత్స్యకారుల ఉనికికే ప్రమాదంగా మారిన జీవో నంబర్ 217ను రద్దు చేయాలని డిమాండ్‌తో ఈనెల 18న కర్నూలులో దీక్ష చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. మత్స్యకారుల కోసం విడతల వారీగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు.