కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడి మరణించడంపై.. పలు చోట్ల తెదేపా నాయకులు నిరసన ర్యాలీలు నిర్వహించారు. కడప, అనంతపురం జిల్లాల్లోని తెదేపా నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మైనారిటీలపై దాడులను నిరోధించడంలో పాలకులు విఫలమయ్యారంటూ విమర్శలు చేశారు.
కడప జిల్లాలో...
సీఎం జగన్కు చట్టం, న్యాయం గురించి మాట్లాడే హక్కు లేదని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వెంకట సుబ్బారెడ్డి విమర్శించారు. నంద్యాలలో ఆత్మహత్యకు పాల్పడిన అబ్దుల్ సలాం కుటుంబ సభ్యుల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ.. కడప పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పోలీసులు, అధికార పార్టీ నాయకుల వల్లే సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపించారు.
అనంతపురం జిల్లా పుట్టపర్తిలో...
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనారిటీలపై రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నా.. సీఎం జగన్ నోరు మెదపడం లేదని మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆరోపించారు. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం సామూహిక ఆత్మహత్యే అందుకు ఉదాహరణన్నారు. సంక్షేమ పథకాలను గాలికొదిలేసి.. దౌర్జన్యాలు, అవినీతి, దాడులే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు.
కళ్యాణదుర్గంలో...
సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని తెదేపా నేత ఉమా మహేశ్వరనాయుడు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఎన్టీఆర్ భవన్ నుంచి ర్యాలీ నిర్వహించి.. స్థానిక మసీదులో ప్రార్థనలు నిర్వహించారు. ఈ మరణాలకు పలువురు నాయకులు, అధికారులే కారణమని ఆరోపించారు. ఘటనకు కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలన్నారు.
నిరసన వ్యక్తం చేస్తున్న తెదేపా నేతలు ఇదీ చదవండి:సలాం కేసుపై పోలీసు అధికారుల సంఘం కీలక వ్యాఖ్యలు