ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విద్యుత్ ఛార్జీల పెంపుపై రాష్ట్రవ్యాప్త నిరసనలు - విద్యుత్​ బిల్లుపై తెదేపా రాష్ట్రవ్యాప్త నిరసనలు

విద్యుత్ ఛార్జీల భారాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు నిరసనలతో కదం తొక్కాయి. నియోజకవర్గ, మండల కేంద్రాల్లో... పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. కరోనాతో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై భారం మోపవద్దని, లాక్‌డౌన్‌ 3 నెలల కాలానికి ప్రభుత్వమే బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశాయి.

tdp-leaders-protest-againist-electricity-bills-hike
tdp-leaders-protest-againist-electricity-bills-hike

By

Published : May 21, 2020, 11:49 PM IST

ప్రజలను ఇబ్బందులకు గురి చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్‌ పని చేస్తున్నారని తెదేపా నేతలు ఆరోపించారు. లాక్‌డౌన్‌తో రోజువారీ జీవితం గడవటమే గగనమైన వేళ..విద్యుత్‌ ఛార్జీలను భారీగా పెంచారంటూ నాయకులు మండిపడ్డారు. ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేయాలన్న అధినేత చంద్రబాబు పిలుపుతో జిల్లా, మండల కేంద్రాల్లో ఆందోళనలు జరిగాయి.

విజయనగరం జిల్లా అంతటా నేతలు ఇళ్ల వద్దే ఉంటూ దీక్షలు కొనసాగించారు. విశాఖ జిల్లాలోనూ పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ ఆధ్వర్యంలో నాయకులంతా విద్యుత్‌ బిల్లులతో ముద్రించిన టీ షర్టులను ధరించి వినూత్నంగా నిరసనలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఏడు రోడ్ల కూడలిలో మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి పార్టీ శ్రేణులతో కలిసి నిరసన చేశారు. టెక్కలిలోని స్వగృహంలో తెదేపా సీనియర్‌ నేత అచ్చెన్నాయుడు దీక్షలో కూర్చున్నారు. పేదల నడ్డివిరిచేలా ఛార్జీలు పెంచారని విమర్శించారు. పెంచిన ఛార్జీలను ప్రభుత్వమే భరించాలని డిమాండ్‌ చేశారు.

తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం నిరసనలు చేపట్టింది. కాకినాడలో మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ప్రజలతో కలిసి నిరసన చేపట్టారు. తునిలో తెలుగుదేశం నియోజకవర్గ బాధ్యుడు యనమల కృష్ణుడు, ప్రత్తిపాడులో వరుపుల రాజా దీక్ష చేపట్టారు. రాజమహేంద్రవరంలో ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి శ్రేణులతో కలిసి ట్రాన్స్‌కో కార్యాలయం ముందు ఆందోళన చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా అంతటా పార్టీ నేతలు నిరసనలో పాల్గొన్నారు. భీమవరంలో తెదేపా జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మీ, ఉండిలో ఎమ్యెల్యే మంతెన రామరాజు ఆందోళన చేపట్టారు. పాలకొల్లులో లాంతర్లు పట్టుకుని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నిరసన వ్యక్తం చేశారు.

పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్​ భవన్‌లో భౌతికదూరం పాటిస్తూ నేతలు, కార్యకర్తలు ఎన్టీఆర్​ విగ్రహం ముందు 12 గంటల దీక్ష నిర్వహించారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షడు కళా వెంకట్రావు సంఘీభావం తెలిపారు. మాజీ మంత్రి దేవినేని ఉమ.. గొల్లపూడిలోని తన నివాసంలో దీక్షకు దిగగా.., విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ అయన భార్య గద్దె అనురాధతో కలిసి స్వగృహంలో దీక్ష చేపట్టారు. ఏడాది పాలనలో విద్యుత్ రంగాన్ని భ్రష్టు పట్టించారని నేతలు మండిపడ్డారు. గుంటూరు జిల్లాలో సీనియర్‌ నేతలు ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, ధూళిపాళ్ల నరేంద్ర, నక్కా ఆనంద్‌బాబు... తమ తమ నివాసంలో దీక్షలు కొనసాగించారు. ఆదాయం పెంచడం చేతగాని జగన్‌..సంక్షేమం పేరిట ప్రజలకు ఇచ్చింది ఛార్జీల రూపంలో మళ్లీ రాబడుతున్నారని ధ్వజమెత్తారు.

ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లోనూ నాయకులు, నేతలు దీక్షలో కూర్చున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు, పుట్టపర్తిలో పల్లె రఘునాథరెడ్డి ఆందోళన చేపట్టారు. కడప జిల్లాలో బీటెక్‌ రవి, నియోజకవర్గ బాధ్యులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

ఇదీ చదవండి: ప్రశ్నించడం నేరమా... షేర్ చేయడం కుట్రా..!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details