TDP Leaders Pay Tribute To Ambedkar: రాష్ట్రంలో సామాజిక న్యాయం ఎక్కడుందో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. నోటికి ప్లాస్టర్లు అంటించి, నాలుగు మంత్రి పదవులిస్తే అది సామాజిక న్యాయం ఎలా అవుతుందని నిలదీశారు. తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అచ్చెన్నాయుడు, నక్కా ఆనంద్ బాబు, అనగాని సత్యప్రసాద్, డోలా బాలవీరాంజనేయ స్వామి, పీతల సుజాత, వర్ల రామయ్య ఇతర ముఖ్యనేతలు పాల్గొని అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. దళితుల ప్రతిఘటన పేరిట రూపొందించిన ఓ పుస్తకాన్ని అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు.
ప్రజల్లో చైతన్యం లేకే గత ఎన్నికల్లో తెదేపాని ఓడించారన్న అచ్చెన్న.. ఏ వర్గానికీ తెలుగుదేశం తక్కువ చేయలేదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రజలు చైతన్యవంతులు కాకుంటే ఇక బానిస బతుకులేనని హెచ్చరించారు. పేదలను లక్ష్యంగా చేసుకుని వారిపై జగన్మోహన్ రెడ్డి ఆర్థికభారం మోపుతున్నారని దుయ్యబట్టారు.