రాష్ట్ర రాజధానిగా అమరావతికో న్యాయం.. జిల్లా కేంద్రాల ఏర్పాటుకు మరో న్యాయాన్ని వైకాపా ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుందని తెదేపా సీనియర్ నేత జీవీ ఆంజనేయులు ప్రశ్నించారు. అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉన్న అమరావతి రాజధానిగా పనికిరాదంటున్న ప్రభుత్వం.. జిల్లా కేంద్రాలు మాత్రం సమదూరంలో ఉండాలనే వాదనను ఎలా తీసుకొస్తుందని ఆయన ప్రశ్నించారు. డైవర్షన్ రాజకీయాలకు వైకాపా బ్రాండ్ అంబాసిడర్గా మారిందని ఆంజనేయులు దుయ్యబట్టారు.
విజయవాడకు వంగవీటి మోహన్ రంగా పేరు పెట్టాలని అన్ని పార్టీలు కోరుతున్నాయని, వెంటనే రంగా పేరు పరిగణనలోకి తీసుకుని ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా డిమాండ్ చేశారు. కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చేలా ఎస్వీ రంగారావు పేరు పశ్చిమగోదావరిలో ఒక జిల్లాకు పెట్టాలని అవసరమైతే దీనికోసం ఉద్యమిస్తామని తేల్చి చెప్పారు.