సులభతర వాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రథమ స్థానం దక్కడం తమ ఘనతేనంటూ అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సీఎం జగన్ కు వచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలనలో ఏపీకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నెంబర్ 1.. వస్తే.. అప్పుడు జగన్ నోరుపారేసుకున్నారని.. గుర్తుచేశారు. ఇప్పుడు అదే నోటితో వైకాపా పాలనలో వచ్చిన ర్యాంకింగ్ కాకపోయినా తన పనితనం చూసే ఏపీకి లో నెంబర్ 1 ఇచ్చినట్లు, తాటికాయంత అక్షరాలతో సొంత మీడియా లో ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో ఒక్క పరిశ్రమ, ఒక్క ఉద్యోగం రాలేదన్న జగనే.. తెదేపా పాలనలో 39,450 పరిశ్రమలు, వాటి ద్వారా 5,13,351 ఉద్యోగాలు, ఐటీ శాఖ ద్వారా 30,428 ఉద్యోగాలు వచ్చాయన్నది ఒప్పుకోవాల్సి వచ్చిందని లోకేశ్ విమర్శించారు.
సులభతర వాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ర్యాంకు తెదేపా ప్రభుత్వ ఘనతేనని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన కృషి వల్లే సులభతర వాణిజ్యంలో ఏపీకి ర్యాంకు వచ్చిందన్నారు. వైకాపా అధికారంలో వచ్చాక చేసింది సున్నానని విమర్శించారు.
విద్వేషాలు, పునాదులపై నిర్మితమైన జగన్ అధికారం ఆంద్రప్రదేశ్ ను అధోగతి పాలు చేసిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆరోపించారు. 15 నెలల కాలంలో ఏపీకి ఒక్క పరిశ్రమనైనా తీసుకొచ్చారా? అని నిలదీశారు. ఒక్క ఉద్యోగమైనా కల్పించారేమో ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. పెండింగ్ పారిశ్రామిక రాయితీలు తాము చెల్లించినట్లు జగన్ గొప్పలు చెప్పుకోవడం పచ్చి అబద్ధమన్నారు.