ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

tdp leaders House arrest: తెదేపా నేతల గృహనిర్బంధం - తెదేపా నేతలు నక్కా ఆనందబాబు, బొండా ఉమ గృహ నిర్బంధం

తెదేపా నేతలు నక్కా ఆనందబాబు, బొండా ఉమ గృహ నిర్బంధం
తెదేపా నేతలు నక్కా ఆనందబాబు, బొండా ఉమ గృహ నిర్బంధం

By

Published : Jul 30, 2021, 3:59 PM IST

Updated : Jul 31, 2021, 3:04 AM IST

15:54 July 30

తెదేపా నేతలు నక్కా ఆనందబాబు, బొండా ఉమ గృహ నిర్బంధం

తెదేపా నేతలు నక్కా ఆనందబాబు, బొండా ఉమ గృహ నిర్బంధం

కొండపల్లి(kondapally) రక్షిత అటవీప్రాంతంలో గ్రావెల్‌ తవ్వకాలు జరిగిన వివాదాస్పద ప్రాంతాన్ని పరిశీలించేందుకు తాము శనివారం వెళ్తామని తెదేపా నిజనిర్ధారణ కమిటీ సభ్యులు, ఇతర నేతలు చెబుతుంటే... అందుకు అనుమతి లేదని అధికారులు అంటున్నారు. అనుమతి ఇవ్వాలని, తమతో అధికారులను కూడా పంపాలని తెదేపా నేతలు కోరినా కృష్ణాజిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ ఎలాంటి భరోసా ఇవ్వలేదు. పరిశీలిస్తామని మాత్రమే చెప్పారు. మరోవైపు... తెదేపా నిజనిర్ధారణ కమిటీ సభ్యులను పోలీసులు శుక్రవారం నుంచే  గృహనిర్బంధం చేశారు. కమిటీలోని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యను విజయవాడలోని ఇంటి నుంచి బయటకు రాకుండా కట్టడి చేశారు. గుంటూరులో నక్కా ఆనంద్‌బాబును, విజయవాడలో బోండా ఉమా, ఒక హోటల్‌లో వంగలపూడి అనిత, నాగుల్‌ మీరాను, మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర, కొనకొళ్ల నారాయణ, జగ్గయ్యపేటలో నెట్టెం రఘురాం, నందిగామలో తంగిరాల సౌమ్య తదితరులను పోలీసులు గృహనిర్బంధం చేశారు.

అధికారులనూ పంపండి

తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, నేతలు నెట్టెం రఘురామ్‌, కొనకళ్ల నారాయణరావు తదితరులు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో కృష్ణా జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ను కలిసి అటవీ ప్రాంతంలో అక్రమ తవ్వకాలపై ఫిర్యాదు చేశారు. ఆ ప్రాంత పరిశీలనకు అనుమతివ్వాలని వినతిపత్రం అందజేశారు. ‘కొండపల్లి అభయారణ్యంలో భారీ ఎత్తున అక్రమంగా గ్రావెల్‌ తవ్వకాలు జరిగాయి. అటవీశాఖ కేసులు నమోదు చేసినా చర్యలు లేవు. గ్రావెల్‌ తవ్వకాలు జరగలేదంటున్నారు. దీనిపై పరిశీలనకు మా అధినేత చంద్రబాబు ఆదేశాల ప్రకారం నిజ నిర్ధారణ కమిటీ సభ్యులం శనివారం వెళ్తున్నాం. మాతో పాటు గనులు, అటవీ, రెవెన్యూ శాఖల అధికారులను పంపించాలని కోరుతున్నాం. అధికారులు రాకపోయినా మా బృందం పరిశీలిస్తుంది. అందుకు అనుమతించండి’ అని వారు కలెక్టర్‌ను కోరారు.

    అధికారులను తమతో పంపాలని కోరామని, శనివారం ఉదయం 10 గంటలకు విజయవాడ నుంచి బయల్దేరే ముందు అధికారుల కోసం వేచి చూస్తామని వర్ల రామయ్య తెలిపారు.. వారు వచ్చినా, రాకున్నా నిజనిర్ధారణ కమిటీ పర్యటనకు వెళ్తుందన్నారు. ‘అక్కడికి వెళ్లడానికి మీరెవరని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. దెబ్బలు తిన్నా, జైళ్లలోకి నెట్టినా మేం ప్రభుత్వ ఆస్తుల రక్షణకు, ప్రజల కోసం పోరాడతాం. వెనకడుగు వేసే ప్రసక్తే లేదు’ అన్నారు. మాజీ మంత్రి నెట్టెం రఘురామ్‌ మాట్లాడుతూ.. కొండపల్లి అటవీప్రాంతంలో అక్రమ గనుల తవ్వకాలను ఉపేక్షించడం చూస్తే.. ప్రభుత్వ పెద్దలకు ఏదో అందుతున్నట్లు ఉందని ఆరోపించారు. మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ.. మాజీమంత్రి దేవినేని ఉమా ఎవరినైనా కొట్టారా? అని ప్రశ్నించారు. కుల దూషణ తదితరాలను తర్వాత చేర్చి కేసు బనాయించారని ఆరోపించారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. దేవినేని ఉమాకు దేహశుద్ధి చేస్తామని ఎమ్మెల్యే ముందే చెప్పారన్నారు. లారీలతో తొక్కిస్తానంటూ మంత్రి కొడాలి నాని గతంలో వ్యాఖ్యలుచేశారని గుర్తుచేశారు. కొండపల్లి అటవీ ప్రాంతంలో వైకాపా నేతలు అక్రమ మైనింగ్‌కు పాల్పడకపోతే తమ పర్యటనను అడ్డుకోవాల్సిన అవసరమేంటని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నిలదీశారు.

ఉమాకు ప్రాణహాని తలపెట్టేందుకే జైలు సూపరింటెండెంట్‌ బదిలీ: అచ్చెన్నాయుడు
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ప్రాణహాని తలపెట్టేందుకే రాజమండి జైలు సూపరింటెండెంట్‌ను బదిలీ చేశారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ‘ఉమాకు ఎలాంటి హాని జరిగినా వైకాపా ప్రభుత్వానిదే బాధ్యత. రాజమండ్రి సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌ బదిలీ వెనుక కుట్రకోణం ఉంది. ఆకస్మిక బదిలీపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలి’ అని ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

ఆనందబాబు ఆగ్రహం
 జగన్‌ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు మండిపడ్డారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా పోలీసులు ఇంట్లోకి వచ్చి అడ్డగించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పని ఉంది. బయటకు వెళ్లాలి. నా ఇంటికి వచ్చి మీ దౌర్జన్యం ఏమిటి. ఇంటికి గడియ పెట్టి తాళం వేస్తారా?.. దీనిపై ప్రైవేటు కేసు వేస్తా’ అని ఆనందబాబు చెప్పినా, పోలీసులు బయటకు వెళ్లనివ్వకుండా గేట్లు వేసి అడ్డుకున్నారు. ఆనందబాబు మాట్లాడుతూ ‘అక్రమ మైనింగ్‌ జరుగుతున్న కొండపల్లికి వెళ్తామని అడ్డుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడికి వెళ్లి తీరతాం. మమ్మల్ని ముందస్తు అరెస్టులు చేస్తున్నారంటే కొండపల్లిలో అక్రమ మైనింగ్‌ జరుగుతున్నట్లే..’ అని ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి:

Tokyo Olympics: సెమీస్​లో పీవీ సింధు.. యమగూచిపై విజయం

Last Updated : Jul 31, 2021, 3:04 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details