రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ బహిష్కరించిన ఎన్నికల్లో గెలిచామని చెప్పుకోవటం.. సీఎం పిచ్చికి పరాకాష్టని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో(CBN MEETING WITH PARTY LEADERS) పలు అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధైర్యం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. తెదేపా నేతలపై అక్రమ కేసులు పెడుతున్న డీజీపీని రీకాల్ చేయాలని కేంద్రానికి, డీవోపీటీకి ఫిర్యాదు చేయాలని సమావేశంలో నిర్ణయించారు.
గుజరాత్ లో పట్టుబడిన వేలకోట్ల రూపాయలు విలువైన హెరాయిన్ కేసుతో.. డగ్స్ మాఫియాకు ఏపీ కేంద్రంగా మారుతోందని తెదేపా నేతలు విమర్శించారు. ఆఫ్ఘానిస్థాన్ స్మగ్లర్లకు తాడేపల్లితో సంబంధం లేకుంటే ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ నిల్వలకు ఏపీ ఎలా కేంద్రంగా మారుతోందని నిలదీశారు. తాలిబన్లు, ఉగ్రవాదులతో సంబంధాలు పెట్టుకునే వరకు వైకాపా నేతలు వెళ్లారని ఆరోపించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి దోషులను నిగ్గుతేల్చి, ప్రమాదం నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని తీర్మానించారు. ఈ నెల 27న నిర్వహించనున్న భారత్ బంద్ కు సంఘీభావం తెలపాలని తెదేపా నిర్ణయించింది.