TDP leaders house arrest: నాటుసారా మరణాలపై ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్ద నిరసనలకు తెదేపా పిలుపునివ్వడంతో.. ఆ పార్టీ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండైన 11మంది ఎమ్మెల్యేల ఇంటిముందు పికెటింగ్ పెట్టారు. విజయవాడలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు సహా మరికొందరు నేతలను ఇంటి నుంచి బయటికి రానివ్వకుండా ముందస్తు గృహనిర్బంధం చర్యలు చేపట్టారు. దీంతో.. పోలీసుల తీరుపై అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో.. ఓ ఎమ్మెల్యేని ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. పార్టీ కార్యాలయానికి వెళుతుంటే అడ్డగించడమేంటని ప్రశ్నించారు. తెదేపా నేతల అణచివేతతో కల్తీ సారా మరణాలపై నిరసనలను అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామన్నారు.
ప్రసాదంపాడు గ్రామాన్ని చుట్టుముట్టిన పోలీసులు :కృష్ణాజిల్లా.. విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు గ్రామాన్ని పోలీసులు చుట్టుముట్టారు. నాటుసారా మరణాలపై తెదేపా నేతలు నిరసనలకు పిలువునివ్వటంతో.. ముందస్తు చర్యలు చేపట్టారు. డీసీపీ హర్షవర్ధన్ రాజ్ ఆధ్వర్యంలో.. గ్రామంలో సుమారు 200మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేశారు.