ఎమ్మెల్యే జోగి రమేశ్‌కు ఏం అర్హత ఉందని డా. అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగం గురించి మాట్లాడారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. భారత రాజ్యాంగాన్ని పక్కనపెట్టి సీఎం జగన్.. కొత్త రాజ్యాంగాన్ని రాస్తున్నాడా? అని నిలదీశారు. రాజ్యాంగాన్ని, బీఆర్ అంబేడ్కర్‌ను అవమానించిన జోగి రమేశ్.. నేరం చేసినట్లో కాదో డీజీపీ చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు వర్గాల మధ్య విభేదాలు రెచ్చగొట్టేలా మాట్లాడారని ఆరోపిస్తూ.. జోగి రమేశ్‌పై చర్యలు తీసుకోవాలంటూ.. డీజీపీకి వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. హోంమంత్రిని బర్తరఫ్ చేయగల ధైర్యం, జోగి రమేశ్‌ను శిక్షించగల దమ్ము రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉందా? అని వర్ల ఈ సందర్భంగా ప్రశ్నించారు.
నాడు-నేడు పథకంలో అవినీతిపై విచారణ: జవహర్
ప్రజాధనం దోపిడీకే నాడు - నేడు పథకం ఏర్పాటు చేశారని మాజీమంత్రి జవహర్ ఆరోపించారు. ఈ పథకంలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వైకాపా నాయకుల దోపిడీ పర్వానికి నాడు - నేడు పథకం పనులను అక్షయ పాత్రగా మార్చుకున్నారని విమర్శించారు. రెండేళ్లుగా విద్యా వ్యవస్థను సీఎం జగన్ సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యమైన విద్యలో 3వ స్థానం నుంచి 19వ స్థానానికి దిగజార్చారని ధ్వజమెత్తారు. పి.గన్నవరం జడ్పీ హైస్కూల్లో ఎమ్మెల్యే కొండేపి చిట్టిబాబు, సంబంధిత అధికారులు సుమారు రూ. 30 లక్షల పనులు చేయించి రూ. 65 లక్షల నిధులను డ్రా చేసుకున్నారని ఆరోపించారు. వైకాపా నాయకుల దోపిడీకి అధికారులు బలవుతున్నారన్నారు.