LOKESH ON AYYANA INCIDENT: నర్సీపట్నం పులిని చూసి పులివెందుల పిల్లి భయపడిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. నోటీసులు ఇస్తామంటూ పోలీసుల డ్రామా, దౌర్జన్యంగా ఇంటి గోడ కూల్చడం చూస్తుంటే జగన్ గట్టిగానే భయపడినట్టు కనిపిస్తుందని విమర్శించారు. ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటనకు వచ్చిన జన జాతర, ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత చూసి పిరికిపంద చర్యలు మొదలెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయన్నపాత్రుడిపై వైకాపా ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. మూడేళ్ల తరువాత కూడా ప్రతిపక్ష నేతల ఇళ్లు కూల్చడం, అరెస్టులనే నమ్ముకున్న జగన్ రెడ్డి దుస్థితి చూస్తుంటే జాలేస్తుందన్నారు.
అచ్చెన్నాయుడు: ఆదివారాన్ని విధ్వంస దినంగా జగన్ ప్రభుత్వం మార్చిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తున్న అయ్యన్నపాత్రుడిపై జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజా క్షేత్రంలో ఎదుర్కొనే ధైర్యం లేక విధ్వంసాలు, విద్వేషాలు, కక్ష సాధింపు చర్యలతో రాష్ట్రాన్ని అస్తవ్యస్థంగా చేస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ గూండారాజుగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని దుయ్యబట్టారు. జగన్ పాలనలో ఆగడాలు, అకృత్యాలు కోకొల్లలని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల అతిప్రవర్తనకు హద్దు అదుపు లేకుండా పోయిందని మండిపడ్డారు.
నక్కా ఆనందబాబు: మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటిని కూల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. అక్రమ కట్టడాలు కడితే పద్ధతి ప్రకారం వెళ్లాలని.. తెల్లవారు జామున అయ్యన్న ఇంట్లోకి అధికారులు దొంగల్లాగ ప్రవేశించడం ఏంటని ప్రశ్నించారు. అధికారులు కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారని మండి పడ్డారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అయ్యన్న పాత్రుడు ఇంటి పై దాడి చేశారని ఆరోపించారు.
యనమల రామకృష్ణుడు: మహానాడులో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకు అయ్యన్న ఇంటి గోడలు కూల్చడం సిగ్గుచేటని యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని నిలదీశారు. అక్రమ కట్టడం అంటూ పోలీసులు, ఇతర అధికారులు చెప్పడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి దిక్కుమాలిన ఆలోచన తాడేపల్లిలోని తుగ్లక్కు మాత్రమే వస్తాయనే విషయం మరోసారి నిరూపితమైందని దుయ్యబట్టారు.
కనకమేడల:‘ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటన విజయవంతం కావడం జీర్ణించుకోలేకే వైకాపావారు ఈ తరహా దాడులకు పాల్పడుతున్నారు. అర్ధరాత్రి అయ్యన్న ఇంటి గోడను కూల్చడం చట్టవ్యతిరేకం. ఆయన ఏ భూమినీ ఆక్రమించలేదు. ఈ అనైతిక దాడికి న్యాయస్థానంలో మూల్యం చెల్లించుకోక తప్పదు’ అని ఎంపీ కనకమేడల రవీంద్ర పేర్కొన్నారు.
జవహర్:‘అయ్యన్నపాత్రుడి ఇంటిపై సీఎం జగన్ చేయించిన దాడి పిరికిపంద చర్య. శని, ఆదివారాలను బుల్డోజర్ రోజులుగా ప్రకటించాలి. పరిపాలనలో లోపాలను ప్రశ్నిస్తే ఇళ్లపై పడతారా?’ అని మాజీ మంత్రి జవహర్ ప్రశ్నించారు.
బోండా ఉమ:తన ఇంటి పునాదులు కదులుతుండడంతో జగన్ తెదేపా నేతల ఇళ్లని కూలుస్తున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ మండిపడ్డారు. జగన్ పాలనే ప్రజావేదిక కూల్చివేతలతో మొదలైందని గుర్తుచేశారు. ఇవాళ జగన్‌ది కావొచ్చు.. కానీ, రేపు తమదని హెచ్చరించారు. చంద్రబాబు పర్యటనకు వచ్చిన జనాన్ని చూసి జగన్ ఓర్వలేక తెదేపా నేతల ఇంటి గోడలను కూలుస్తున్నారని ధ్వజమెత్తారు. వెలంపల్లి అవినీతిని ప్రశ్నిస్తే ఓ సామాన్యుడ్ని అరెస్ట్ చేయిస్తారా అని నిలదీశారు. 70 ఏళ్ల అయ్యన్నపై రేప్ కేసు పెట్టారని.. ఇది అధికార దుర్వినియోగం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనతో ప్రభుత్వం ఉలిక్కిపడిందన్నారు.
చినరాజప్ప: చంద్రబాబు మినీమహానాడు కార్యక్రమాలకు వస్తున్న ప్రజా స్పందనను చూసి సీఎం జగన్ ఓర్వలేకపోతున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తున్న తెదేపా నాయకుడు అయ్యన్నపాత్రుడిపై ముఖ్యమంత్రి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. ప్రజా క్షేత్రంలో ఎదుర్కొనే ధైర్యం లేక విధ్వంసాలు, విద్వేషాలు, కక్ష సాధింపు చర్యలతో రాష్ట్రాన్ని అస్తవ్యస్థం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోమిరెడ్డి:భారతీయ పౌరులుగా ఉండే హక్కులేవీ రాష్ట్రంలో తమకు ఉండట్లేదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. అధికారం ఉంది కదా అని పోలీసుల్ని గూండాల్లా వాడుకుంటున్నారని మండిపడ్డారు. జగన్మోహన్రెడ్డి రౌడీ రాజ్యానికి తాజా పరిణామాలు పరాకాష్ఠ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా దాడులపై ఇంతవరకు పోలీసులు ఒక్క చర్యా ఎందుకు తీసుకోలేదని నిలదీశారు.