"హెలికాఫ్టర్లు, ప్రైవేటు జెట్లలో తిరిగేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి.. 16నెలల్లో రూ.26కోట్ల ప్రజాధనం ఖర్చు చేశారు. చీకట్లో దిల్లీ వెళ్లి జైలుకు పోకుండా వేడుకోలు, జడ్జీల మీద ఫిర్యాదులు, కోర్టు ముందు హాజరు, పెళ్లిళ్లు, పేరంటాల కోసం ఆ డబ్బు ఖర్చు పెట్టారు తప్ప ప్రజల కోసం ఏం చేశారు" అని తెదేపా నేత అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు.
కనీసం రూ.26పెట్టుబడులు కూడా తీసుకురాలేదు: జవహర్
ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి హెలికాఫ్టర్ బిల్లులకు రూ.26కోట్లు ఖర్చుపెట్టారని.. రాష్ట్రానికి కనీసం కనీసం 26రూపాయల పెట్టుబడులు కూడా తీసుకురాలేదని మాజీమంత్రి జవహర్ ఎద్దేవా చేశారు. ఇడుపులపాయలో తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతికి, వివేకానందరెడ్డి వర్థంతికి, ఫ్యాక్షనిస్టు చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు సీఎం హెలికాఫ్టర్ వాడారని తెలిపారు. ప్రత్యేక హోదా సాధన పేరుతో తన కేసుల మాఫీ కోసం దిల్లీ వెళ్లేందుకూ ప్రత్యేక విమానాలు వినియోగించారని విమర్శించారు. హెలికాఫ్టర్ పర్యటనలకే రూ.26కోట్లు జనం సొమ్ము కాజేశారంటే, వచ్చే 3ఏళ్లలో వివాహాలు, విందులు, చావులు, పరామర్శలకు హెలికాఫ్టర్ లో తిరగడానికి వందల కోట్లు కొట్టేస్తారని ట్విట్టర్లో దుయ్యబట్టారు.