TDP leaders fires on CM: రాజధాని విషయంలో హైకోర్టు తీర్పుతోనైనా సీఎం జగన్.. మొండిపట్టు వీడాలని తెదేపా నేతలు అన్నారు. ఇప్పటికీ మొండితనం వీడకుంటే భగవంతుడు కూడా క్షమించడని హెచ్చరించారు. అనవసరంగా పట్టుదలకు పోయి రాష్ట్రాన్ని నాశనం చేయవద్దని హితవు పలికారు.సహజ న్యాయం చెల్లుబాటు కోసం భూములిచ్చిన రైతులు.. 800రోజులకు పైగా పోరాడాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు వచ్చి 24 గంటలైనా ముఖ్యమంత్రి ఇంకా స్పందించకపోవడాన్ని వారు తప్పుబట్టారు.
రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయొద్దు: సోమిరెడ్డి
హైకోర్టు తీర్పుతోనైనా జగన్ రెడ్డి.. మొండిపట్టు వీడాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హితవు పలికారు. అమరావతి పై ప్రభుత్వం నిర్ణయం ఇకనైనా తీరు మార్చుకోకుంటే భగవంతుడు కూడా క్షమించడని హెచ్చరించారు. సుప్రీంకోర్టుకు వెళ్లాలనుకుంటే వెళ్లొచ్చు కానీ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయొద్దని హెచ్చరించారు.
మహిళలపై ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఆగ్రహం
హైకోర్టు తీర్పు నేపథ్యంలో అమరావతి మహిళలను అభినందించేందుకు.. తెదేపా నేత వంగలపూడి అనిత మందడం శిబిరానికి వచ్చారు. మహిళలు వంటింటి కుందేళ్లు కాదని అమరావతి మహిళలు నిరూపించారని కితాబిచ్చారు. గతేడాది మహిళా దినోత్సవం రోజున వైకాపా ప్రభుత్వం మహిళలను అవమానించిందన్నారు. ఉద్యమంలో మహిళలపై ప్రభుత్వం వ్యవహరించిన తీరు.. సిగ్గు, నీతిమాలిన చర్యగా అభివర్ణించారు. ఎక్కడ చూసినా మహిళలపై అఘాయిత్యాలు, వేధింపులు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో.. మహిళలే జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని అన్నారు.
అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నారు: దేవినేని ఉమా
సీఆర్‌డీఏ చట్టాన్ని పకడ్భందీగా రూపొందించడం వల్లే అమరావతి రైతులకు హైకోర్టులో న్యాయం జరిగిందని.. తెదేపా నేత దేవినేని ఉమా అన్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో మందడంలోని దీక్షా శిబిరం వద్ద కృతజ్ఞతసభ నిర్వహించారు. అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నారా అని మాజీ అనుమానం వ్యక్తం చేశారు. ప్రజా వేదికను కూల్చినప్పుడు అందరూ మౌనంగా ఉన్నారని.. కానీ రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తారని ఎవరూ ఊహించలేదన్నారు. త్వరలోనే ఈ అరాచకానికి ముగింపు ఉంటుందని హెచ్చరించారు.
అసమర్ధ ముఖ్యమంత్రిగా జగన్ నిలిచిపోతారు: నక్కా ఆనంద్ బాబు
రాష్ట్ర చరిత్రలో అసమర్ధ ముఖ్యమంత్రిగా జగన్ నిలిచిపోతారని వ్యాఖ్యానించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుతో రాజధాని గ్రామాలతో పాటు ఐదు కోట్ల ఆంధ్రులు పండుగ చేసుకున్నారని అన్నారు. రాష్ట్ర మంత్రులకు.. కోర్టులన్నా, చట్టాలన్నా గౌరవం లేదని అందుకే ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని అన్నారు.
కమ్యూనిస్టులతో కూడా కొబ్బరికాయ కొట్టించింది: రామకృష్ణ
అమరావతి ఉద్యమం కమ్యూనిస్టులతో కూడా కొబ్బరికాయ కొట్టించిందని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. అమరావతి మహిళలకు భయపడి జగన్ తన చుట్టూ వందలాది మంది పోలీసులను పెట్టుకుని బయటకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. హైకోర్టు తీర్పు వచ్చాక కూడా మంత్రులు మాట్లాడుతున్న మాటలు సరికావన్నారు. మళ్లీ కొత్త చట్టం తెస్తామని కోర్టులతో కొట్లాడుతామని చెప్పడం తప్పుబట్టారు.