నిండు శాసనసభలో రాజధానిగా అమరావతికి వైకాపా, భాజపా మద్దతు తెలిపాయని సోమిరెడ్డి గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మూడు రాజధానులు చేయాలనే ఆలోచనతోనే ఉన్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప ఆక్షేపించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజధానిని అమరావతిలోనే కొనసాగిస్తానని చెప్పి ఎన్నికలు ముగిసి ముఖ్యమంత్రి అయిన తరువాత మాటా మార్చారని ఆరోపించారు.
మూడు రాజధానులు ప్రజావ్యతిరేక నిర్ణయమని అశోక్ గజపతిరాజు స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన మాటను ప్రభుత్వమే నిలబెట్టకపోవటం తగదని ఆయన హితవు పలికారు. దేశమంతా కరోనా విపత్తుపై దృష్టి సారిస్తే ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా ఉందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రజల మనోభావాలు గౌరవించడం అందరి బాధ్యత అని అశోక్‌గజపతిరాజు అన్నారు. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఆమోదించిన గవర్నర్ రాష్ట్రాన్ని నిట్టనిలువునా దహనం చేశారని మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. అమరావతి అంగుళం కూడా కదలదన్న భాజపా పెద్దలు ఇప్పుడేం సమాధానం చెప్తారని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి అమరావతికి నిప్పుపెట్టి పబ్జీ ఆడుకుంటూ, పైశాచిక ఆనందం పొందుతున్నారని ధ్వజమెత్తారు.
కులపిచ్చితో కొందరు స్వార్థపరులు రాష్ట్రాన్ని నాశనం చేయడానికి సిద్ధమయ్యారని తెదేపా నేత గొల్లపల్లి సూర్యారావు మండిపడ్డారు. భూములిచ్చిన రైతులు, ఆడబిడ్డల ఘోష, ఆర్తనాదాలు వినపడటం లేదా అని ప్రశ్నించారు. రాష్టప్రభుత్వం చేసే తప్పులను కేంద్రం ఎందుకు ఆమోదిస్తోందని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని వారు తెలుగుదేశాన్ని విమర్శిస్తున్నారని సూర్యారావు మండిపడ్డారు.