రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యాసంస్థల విషయంలో సర్కారు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సర్కారుకు తీరుపై పలువురు నేతలు మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (ఏ)కు తూట్లు పొడుస్తోందని తెదేపా ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్ మండిపడ్డారు. విద్య అనే ప్రాథమిక హక్కును పౌరులకు దక్కకుండా చేసే అధికారం ఈ ప్రభుత్వానికిలేదని అన్నారు. లక్షలకోట్ల ఆస్తులున్నందునే ప్రభుత్వం ఎయిడెడ్ విద్యాసంస్థల ఆస్తులపై కన్నేసిందని ఆరోపించారు. కమిటీలు వేసి బలవంతంగా విద్యా సంస్థలను స్వాధీనం చేసుకోవడానికి జగన్ సర్కారు పావులు కదుపుతోందని ఆరోపించారు. ఇప్పటికే విద్యార్థులు అమ్మఒడి వద్దు.. మా బడే మాకు ముద్దు అని నినదిస్తున్నారని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వ నిర్ణయం 2.50 లక్షల మంది విద్యార్థుల జీవితాలకు శరాఘాతం కానుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త నియామకాలు చేస్తానని పాదయాత్రలో హామీ ఇచ్చిన సీఎం జగన్.. ఇప్పుడు ఎయిడెడ్ సంస్థల్లోని ఉపాధ్యాయులను కేటాయించడాన్ని తప్పుపట్టారు.
ఉపాధ్యాయులకు జీతాలివ్వలేకే..
రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల విద్యారంగం కుదేలైందని తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ప్రభుత్వం విదేశీ విద్య నిధుల్ని తగ్గించేసిందని మండిపడ్డారు. ఫీజు రీయంబర్స్ మెంట్ ను ఎత్తేశారని ధ్వజమెత్తారు. అమ్మఒడి పథకానికి కుటుంబంలో ముగ్గురు, నలుగురు పిల్లలకు అవకాశాలున్నా ఒక్కరికే ఇస్తున్నారన్నారు. ఎయిడెడ్ పాఠశాలలను రద్దు చేసి పిల్లలను విద్యకు దూరం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలు, కళాశాలలను మూసివేసే విధానం తప్పని పేర్కొన్నారు. విద్య విషయంలో ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తోందని ఎద్దేవా చేశారు. ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు జీతాలు చెల్లించలేని స్థితిలో ప్రభుత్వముందని దుయ్యబట్టారు. పాఠశాలలకు, కళాశాలలకు ఇవ్వాల్సిన ఫీజురీయంబర్స్ మెంట్ ను వెంటనే ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు.
25 వేల ఎకరాల్లో గంజాయి సాగు..
వైకాపా దిగజారిపోయిందనడానికి విజయసాయి రెడ్డి వ్యాఖ్యలే నిదర్శనమని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. గంజాయి వ్వవహారంలో ఎంపీ విజయసాయి తెదేపాను నిందించడం తగదన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ గంజాయిపై ఉక్కుపాదం మోపాలని అక్కడి పోలీసులను ఆదేశించారని.. అంత మాత్రాన కేసీఆర్ కూడా తెదేపా వ్యక్తేనా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 25 వేల ఎకరాల్లో గంజాయి సాగు జరుగుతున్నట్లు అందరికీ తెలుసన్నారు. మహారాష్ట్ర, దిల్లీ, కర్ణాటక, తెలంగాణ పోలీసులు ఏపీ గంజాయిని పట్టుకున్నప్పటికీ.. ముఖ్యమంత్రి దానిపై మాట్లాడడం లేదని విమర్శించారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన ఆధారాలు అడిగే హక్కు విజయసాయికి ఉందా అంటూ నిలదీశారు. ఎంపీకి నిజంగా దేశభక్తి ఉంటే.. రాష్ట్రంలో గంజాయి పట్టుకున్న పోలీసులను అభినందించాలని అశోక్ బాబు సూచించారు.
వైకాపా గుర్తింపు రద్దు చేయాలి..