రాష్ట్ర ప్రభుత్వ పాలనపై తెదేపా నేతలు(TDP Leaders fired on YCP government) మండిపడ్డారు. రెండున్నరేళ్ల పాలనలో వైకాపా నేతలు ప్రజలకు చేసిందేంటని నిలదీశారు. మహిళలకు, ఎస్సీలకు, మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. జగన్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని మండిపడ్డారు.
మహిళలకు అడుగడుగునా అవమానాలే - వంగలపూడి అనిత, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు
వైకాపా పాలనలో మహిళలకు అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నాయని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆక్షేపించారు(Vangalapudi Anitha Fired on YCP government). వైకాపా కౌరవులు మహిళలను అవమానిస్తూ.. పైశాచిక ఆనందం పొందుతున్నారని దుయ్యబట్టారు. అనంతపురంలో తెలుగు మహిళా రాష్ట్ర నేతల ఇళ్లపై పోలీసుల దాడులు హేయమన్నారు. మహిళల ఇళ్లలోకి వెళ్లి సోదాలు చేయడానికి పోలీసులకు సిగ్గు అనిపించలేదా? అని దుయ్యబట్టారు. ప్రభుత్వ అరాచకాన్ని ప్రశ్నించేవారు ఉగ్రవాదుల్లా కనిపిస్తున్నారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు భార్యపై దిగజారి మాట్లాడిన నేతలకు అదనపు భద్రత కల్పించి, మహిళలను అవమానించిన వారిని ప్రశ్నిస్తే ఎదురుదాడులు చేస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి, డీజీపీ ఎన్ని ప్రయత్నాలుచేసినా, తెలుగు మహిళల పోరాటాన్ని నిలువరించలేరని అన్నారు. వైకాపా పాలనకు జనం బుద్ధిచెప్పే రోజులు దగ్గరపడ్డాయని అనిత అన్నారు.
రెండున్నరేళ్ల పాలనలో ఎస్సీలకు ఏం చేశారు? -కె.ఎస్. జవహర్, మాజీ మంత్రి
వైకాపా రెండున్నరేళ్ల పాలనలో ఎస్సీలకు 36 వేల కోట్లు ఖర్చు చేశామని మంత్రి విశ్వరూప్ చెప్పటం జగన్ రెడ్డి దగాకోరుతనానికి నిదర్శనమని మాజీ మంత్రి కె.ఎస్. జవహర్(Former minister Jawahar questioned on YCP ruling time) విమర్శించారు. నవరత్నాలు కాకుండా ప్రత్యేకంగా ఈ రెండున్నరేళ్లలో ఎస్సీలకు ఏం చేశారో చెప్పగలరా? అని ఆయన నిలదీశారు. 36 వేల కోట్లు ఎవరికి, ఎక్కడ ఖర్చు చేశారో ముఖ్యమంత్రి జగన్ చెప్పాలని డిమాండ్‌చేశారు. చంద్రబాబు పాలనలోనే దళితుల సంక్షేమం, అభివృద్ది జరిగిందని స్పష్టంచేశారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాలు, భూమి కొనుగోలు పథకం వంటివి నిలిపివేసి ఎస్సీల్ని ఆర్థికంగా ఎదగకుండా జగన్ రెడ్డి అణచివేశారని జవహర్ ఆరోపించారు.