వివేకాను ఎవరు చంపారనేది సీఎం జగన్‌కు మొత్తం తెలుసునని తెదేపా నేత చినరాజప్ప అన్నారు. హంతకులెవరో తెలిసికూడా.. కావాలనే రెండున్నరేళ్ల నుంచి మౌనంగా ఉన్నారని ఆరోపించారు. ఇప్పటికైనా హంతకులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
40 కోట్ల రూపాయలకు.. బాబాయ్‌కి గొడ్డలి పోటుపై ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని.. తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు. నవరత్నాలతో ప్రజలకి పన్ను పోటు పొడిచారని.. మొత్తానికి ఏపీకి వెన్నుపోటు పొడిచారని గోరంట్ల విమర్శించారు. నారాసుర రక్త చరిత్ర అని సొంత పేపర్‌లో రాసిన వారు ఇప్పుడేం రాస్తారని నిలదీశారు.
దివంగత వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసింది ఎవరో.. ఆనాడే సీఎం జగన్‌కు తెలసని.. తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. అన్ని తెలిసే... సీబీఐ విచారణ అంటూ.. జగన్ మోహన్‌రెడ్డి నాటకాలు ఆడారని దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో సీబీఐ విచారణ అడిగిన జగన్.. ముఖ్యమంత్రి అయ్యాక హైకోర్టులో వేసిన కేసును ఎందుకు వెనక్కి తీసుకున్నారో రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యిందన్నారు. తన రాజకీయాలకు రక్తచరిత్రను వాడుకున్నారని ధ్వజమెత్తారు.