TDP LEADERS ON YSRCP : గంజాయి, ఇతర మాదకద్రవ్యాల నియంత్రణలో జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. ఏపీ నుంచి దేశంలోని ఇతరప్రాంతాలకు గంజాయి సరఫరా అవుతోందని కేంద్ర మంత్రి చెప్పడంపై రాష్ట్ర ప్రభుత్వ స్పందనేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో గంజాయి వాడకంతోపాటు, మద్యం, నాటాసారా అమ్మకాలు పెరిగాయన్నారు. మాదకద్రవ్యాలను ప్రభుత్వమే ప్రమోట్ చేస్తుండటంతో మహిళలపై దారుణాలు అధికమయ్యాయని చినరాజప్ప విమర్శించారు.
2018లో రాష్ట్రం నుంచి ఇతరప్రాంతాలకు 33,900కిలోల గంజాయి స్మగ్లింగ్ జరిగితే.. అది 2020 నాటికి లక్షా 6వేల కిలోలకు పెరిగిందన్నారు. 2018లో మాదకద్రవ్యాల బారినపడి 196మంది చనిపోతే.. 2020లో ఆ సంఖ్య 380కు చేరిందన్నారు. 2018లో గంజాయి రవాణా, సాగు ఇతర వ్యవహారాల్లో 170మందికి శిక్షలుపడితే.. 2020లో కేవలం 24 మందిని మాత్రమే శిక్షించారన్నారు. ఈ లెక్కలే రాష్ట్రంలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వ్యవహారం ఎంతగా సాగుతోందో స్పష్టంచేస్తున్నాయని చినరాజప్ప విమర్శించారు.
దళితులను అన్ని విధాలా వంచించారు: వర్ల రామయ్య
ఎస్సీ, ఎస్టీల బాధలు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లినా.. చెవిటివాని ముందు శంఖం ఊదినట్లే ఉందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. వైకాపా రెండున్నరేళ్ల పాలనలో దళితులను అన్ని విధాలా వంచించారని పేర్కొంటూ.. సీఎస్ సమీర్ శర్మకు లేఖ రాశారు. సీఎం జగన్.. 30 నెలల పాలనలో 29 ఎస్సీ, ఎస్టీ పథకాలను రద్దుచేసి.. రూ. 26,663 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. ఆ నిధులను తిరిగి ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం ఖర్చు చేసేలా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన 12 వేల ఎకరాల అసైన్డ్ భూములను అన్యాయంగా ప్రభుత్వమే లాక్కుందని మండిపడ్డారు.