మద్యంపై ఐదేళ్లలో పదివేల కోట్ల ఆదాయమే ముఖ్యమంత్రి లక్ష్యమని తెదేపా ఎమ్మెల్యేలు ఆరోపించారు. అందుకోసమే కొత్తబ్రాండ్లు, కొత్త పాలసీ తెచ్చారని ధ్వజమెత్తారు. సభలో నిన్న ముఖ్యమంత్రి చెప్పిన ప్రతి మాటా అవాస్తవమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. డిస్టిలరీలను నడుపుతున్నది జగన్ బినామీలు కాదా ? అని ఆయన ప్రశ్నించారు. డిస్టిలరీలు చంద్రబాబు హయాంలోవి అంటున్న జగన్ ఎందుకు రద్దుచేయట్లేదని నిలదీశారు. తెలుగుజాతి ఉన్నంతవరకు చంద్రబాబు బ్రాండ్ ఉంటుందని.. చంద్రబాబు.. జగన్ మాదిరిగా ఛీప్ లిక్కర్ బ్రాండ్ కాదని అచ్చెన్నాయుడు అన్నారు.
సారా ఆదాయంతో సంక్షేమ పథకాలు అమలు చేస్తామనడం సిగ్గుచేటని.. తెలుగుదేశం సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసపోయామన్న భావనలో.. రాష్ట్ర ప్రజలు ఉన్నారని చెప్పారు. వైకాపా ప్రభుత్వ పతనం ప్రారంభమైందని 2024లో తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మద్యం మాఫియాకు సమాతరంగా బియ్యం మాఫియా కూడా తయారైందని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆరోపించారు.
మద్యం, బియ్యం మాఫియాలో ముగ్గురు మంత్రులు.. 100 మంది వైకాపా ఎమ్మెల్యేలకు సంబంధం ఉందన్నారు. మద్యం ఆదాయం 5 శాతం రాష్ట్ర ఖజానాకు వెళ్తే.. 95 శాతం ఆదాయం సీఎం జగన్కు వెళ్తోందని అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. చంద్రబాబును అనుమతించిన డిస్టలరీలన్నింటినీ జగన్ మనుషులు.., సలహాదారులే లాక్కున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని ఏ ఆసుపత్రిలో చూసిన కల్తీ మద్యం బాధితులే కనిపిస్తున్నారని ఉండి ఎమ్మెల్యే రామరాజు అన్నారు. లిక్కర్ ఉత్పత్తి ధర కంటే..ఐదు రెట్లు ఎక్కువగా అమ్ముతున్నారన్నారు. రాష్ట్రంలో నాటుసారా బట్టీలు, బెల్టు షాపులు పెరిగిపోయాయని దుయ్యబట్టారు.