తెదేపా అధినేత చంద్రబాబు సతీమణిపై శాసనసభలో వైకాపా నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో (TDP Leaders Fire On YCP) మండిపడ్డారు. ఆడపడుచులపై పరుష వ్యాఖ్యలు.. వైకాపా అరాచక పాలనకు నిదర్శనమని ధ్వజమెత్తారు. చేతగాక, చేవలేక సీఎం జగన్ నీచంగా వ్యవహరిస్తున్నారన్నారు.
వైకాపా నేతలు రోడ్లపై తిరగలేరు..
ముఖ్యమంత్రి జగన్, వైకాపా నేతలపై మాజీ మంత్రి పీతల సుజాత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు కుటంబంపై వైకాపా నేతల వ్యాఖ్యలను ఖండించిన ఆమె..తాము తలుచుకుంటే వైకాపా నేతలు రోడ్లపై తిరగలేరని హెచ్చరించారు. " వైకాపా గౌరవ సభను, కౌరవ సభగా మార్చేసింది. ఆనాడు సీతను అవమానించిన రావణాసరుడికి ఏ గతి పట్టిందో నేడు భువనేశ్వరిని అవమానించిన వైకాపాకి అదే గతి పడుతుంది. వైకాపా నాయకులందరికీ డీఎన్ఏ పరీక్షలు చేయించాలి. వైకాపా ఎమ్మెల్యేలు తమ ఇంటి మహిళలతో డీఎన్ఏ పరీక్షలకు వెళ్దాం అని చెప్పగలరా..? తాము తలుచుకుంటే వైకాపా నేతలు రోడ్డుపైకి రాలేరు." అని పీతల సుజాత హెచ్చరించారు.
చేతగాక నీచపు పనులు
వివేకా రక్తపు మరకలు ఆనాడు ఎలా తుడిచేశారో.. ఈనాడు వైకాపా ఎమ్మెల్యేల మాటలను అసెంబ్లీ రికార్డ్స్ నుంచి తొలగించారని తెదేపా శాసనసభపక్ష విప్ డోలా బాల వీరంజనేయ స్వామి మండిపడ్డారు. సీఎం జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే నిన్న చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గురించి మాట్లాడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. తల్లిని, చెల్లిని వాడుకుని వదిలేసిన చరిత్ర జగన్‌దని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విమర్శించారు. చేతగాక, చేవలేక జగన్ నీచపు పనులు చేస్తున్నారని మండిపడ్డారు. వైకాపా నేతలు పిచ్చి కుక్కల్లాగా వాగుతున్నారని ధ్వజమెత్తారు. పాలన వైఫల్యాలను కప్పిపుచుకోవడానికి చంద్రబాబు కుటుంబ సభ్యులపై తప్పుడు మాటలు మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు ప్రతిష్ఠతను దెబ్బతీయాలనే కుట్ర చేసారన్నారు. చంద్రబాబు పోరాట పటిమ చూసి ఓర్వలేకనే అప్రదిష్టపాలు చేయాలని చూస్తున్నారని ఆక్షేపించారు.