కేంద్రంతోపాటు పలు రాష్ట్రాలు పెట్రో ధరలను తగ్గించినా.. సీఎం జగన్ మాత్రం ఎప్పటిలాగే తన రివర్స్ విధానాన్ని కొనసాగిస్తున్నారని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేసారు. కర్ణాటకలో పెట్రోలు రూ.101.64 డీజిల్ రూ. 85.98 గా ఉంటే.. ఏపీలో మాత్రం రూ.111.10, రూ.97.14 నుంచి కిందకు దిగలేదన్నారు. పన్నులు తగ్గించకపోవడంతో సరిహద్దుల్లో పెట్రో బంకులు మూతపడుతున్నాయన్నారు. అదే సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా ఏపీకి తరలివస్తోందన్నారు. ఇవన్నీ తాడేపల్లి ప్యాలెస్ నియంతృత్వ పాలనకు నిదర్శనమని సోమిరెడ్డి మండిపడ్డారు. కష్టకాలంలో జగన్ ప్రజల నడ్డివిరగ్గొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేాశారు. కనికరంలేని ఈ పాలన ఖచ్చితంగా ప్రజలపై కక్షసాధింపేనని ఆక్షేపించారు.
ఎన్నికల వ్యవస్థపైనా అరాచకం
స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా అభ్యర్ధులు నామినేషన్లు వేయకుండా వైకాపా కుట్ర చేసిందని ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు ఆరోపించారు. వైకాపా అరాచకాలను ఎదురించి తెదేపా అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారన్నారు. 328 స్థానాలకు గానూ..322 చోట్ల తెదేపా తరపున నామినేషన్లు వేసినట్లు స్పష్టం చేశారు. ఎన్నికల వ్యవస్థను కూడా హైజాక్ చేసేందుకు జగన్ ప్రయత్నం చేసారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య బద్ధంగా జరగాల్సిన ఎన్నికల వ్యవస్థపైనా అరాచకం సృష్టించటం శోచనీయమన్నారు.