VANGALPUDI ANITHA: విశాఖ ప్రజలను చూస్తే సీఎంకు భయం పట్టుకుందని తెదేపా మహిళ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. అందుకే సీఎం వెళ్లే దారిలో దుకాణాలు మూయించారని, ట్రాఫిక్ ఆపేశారని దుయ్యబట్టారు. ప్రజలను చూసి భయపడే వారిని నాయకుడు అనరని విమర్శించారు. విశాఖ ప్రజలు నిన్న 3 గంటలపాటు అనేక ఇబ్బందులు పడ్డారన్న ఆనిత.. గంటలపాటు ట్రాఫిక్ నిలిపే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. సీఎం, పోలీసులు.. విమాన ప్రయాణీకులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధాని వచ్చి, సీఎం ఇక్కడే ఉంటే విశాఖ ప్రజలను రోడ్లపై తిరగనివ్వబోరని ఆరోపించారు.
డీాజీపీకి వర్ల రామయ్య లేఖ..
విధులో ఉన్న సీఐ పై దుర్భాషలాడి బెదిరించిన వైకాపా మంత్రి సీదిరి అప్పలరాజుపై కేసు నమోదు చేయాలని... డీజీపై గౌతం సవాంగ్ కు తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ రాశారు. డీజీపీ గా సవాంగ్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి పోలీసుల పనితీరు వైకాపాకు అనుకూలంగా మారిందని లేఖలో విమర్శించారు. పోలీసులపై తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించడం, పరుష పదజాలంతో దుర్భాషలాడడం వంటివాటికి.. విశాఖ శారదా పీఠం వద్ద జరిగిన ఘటన ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు.