ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TDP Leaders: మద్యపాన నిషేధం పేరిట వైకాపా ప్రభుత్వం మోసం..: తెదేపా - mlc bacchula comments

TDP Leaders: జంగారెడ్డిగూడెెంలో కల్తీసారా మరణాలను సహజ మరణాలుగా చిత్రీకరించడం దారుణమని తెదేపా నాయకులు విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా ఈ ఘటనను తప్పుదోవ పట్టించడం దుర్మార్గమన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం పేరిట వైకాపా ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాసిరకం మద్యంతో ఏటా వేల కోట్ల రూపాయలు దండుకుంటూ ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అమలవుతున్న మద్యం పాలసీ వలన ఎన్నో కుటుంబాలు చితికిపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు.

TDP Leaders fires on liquor
మద్యంపై తేదేపా నేతల మండిపాటు

By

Published : Mar 18, 2022, 5:19 PM IST

TDP Leaders: సంపూర్ణ మద్యపాన నిషేధం పేరిట వైకాపా ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మండిపడ్డారు. కల్తీసారా మరణాలను సహజ మరణాలుగా చిత్రీకరించడం దారుణమని విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా జంగారెడ్డిగూడెం ఘటనను తప్పుదోవ పట్టించడం దుర్మార్గమన్నారు. కల్తీసారా విచ్చలవిడిగా పెంచి వైకాపా సర్కారు ఆడవాళ్ల తాళిబొట్లు తెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబీకులకు 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు తెదేపా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

దోపిడీ కోసమే కల్తీ మద్యం, సారా అమ్మకాలు- సోమిరెడ్డి

దోపిడీ కోసమే ముఖ్యమంత్రి కల్తీమద్యాన్ని, కల్తీ సారాని విక్రయిస్తూ ప్రజల ప్రాణాలు హరిస్తున్నారని తెదేపా పొలిట్ బ్యూరోసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరుజిల్లా సర్వేపల్లిలో ఎస్.ఎన్.జే కంపెనీ తయారుచేసే గ్రీన్ ఛాయిస్ మద్యం క్వార్టర్ బాటిల్ ‘(180ఎమ్.ఎల్) ధర 120 రూపాయలు ఉంటే, ప్రభుత్వం ఆ బాటిల్‌ను 15రూపాయలకే కొనుగోలు చేస్తోందన్నారు. 48సీసాలను 696 రూపాయలకి కొని బయట అదే 48సీసాలను ఈ ప్రభుత్వం 5,760 రూపాయలకి అమ్ముతోందని విమర్శించారు. ఆవిధంగా ఒక్కో బాక్స్​పై ఈ ప్రభుత్వానికి 5,064 రూపాయల వరకు లాభం వస్తోందని తెలిపారు. నాసిరకం మద్యంతో ఏటా 5వేలకోట్ల రూపాయలు దండుకుంటూ ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో మద్యం తయారుచేస్తున్న కంపెనీలన్నీ వైకాపా నేతలు, మంత్రులు, ఎంపీలవేనని ఆరోపించారు. జంగారెడ్డిగూడెంలో 28మంది చనిపోకముందే ప్రభుత్వం నాటుసారా నిల్వలను నాశనంచేసి ఉండాల్సిందని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

ఎన్నో కుటుంబాలు చితికిపోతున్నాయి- విజయనగరం పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు

రాష్ట్రంలో అమలవుతున్న మద్యం పాలసీ వల్ల ఎన్నో కుటుంబాలు చితికిపోతున్నాయని విజయనగరం పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఆరోపించారు. జగన్మోహన్​రెడ్డి సీఎం కాకముందు సంపూర్ణ మద్యనిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా మద్యపాన నిషేధం దిశగా ఒక్క అడుగూ వేయలేదని మండిపడ్డారు. రాష్ట్రం ఆదాయం పెంచలేక, సంపద సృష్టించలేక, జనాన్ని కొల్లగొట్టే పథకం వేశారని ఆరోపించారు. విజయనగరం జిల్లాలోనూ ప్రతి గ్రామంలోనూ మద్యం ఏరులై పారుతోందన్నారు. గ్రామస్థాయి వైకాపా నాయకులు బెల్ట్ దుకాణాల ఏర్పాటుకు వేలం పాట పాడుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో మద్యం ద్వారా రాష్ట్రంలో జరుగుతున్న అనర్ధాలు, మహిళలపై జరుగుతున్న అఘత్యాలపై ప్రజలు, మహిళల్లో చైతన్యం కల్పించేందుకు ఈ నెల 21న విజయనగరంలో తెదేపా నారీ సంకల్ప దీక్ష నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ దీక్షకు విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తెదేపా నేతలు, మహిళలు పాల్గొంటారన్నారు.

ప్రజారోగ్యానికి శాపంగా జే బ్రాండ్స్​- మాజీ మంత్రి పీతల సుజాత

జగన్ రెడ్డి అమ్ముతున్న జే బ్రాండ్స్ ప్రజారోగ్యానికి శాపంగా మారాయని మాజీ మంత్రి పీతల సుజాత దుయ్యబట్టారు. వైకాపా పాలనలో కల్తీసారా, పిచ్చిబ్రాండ్ల విక్రయాలతో రాష్ట్రంలో మరణాలు సంభవిస్తున్నాయని మండిపడ్డారు. నాటుసారా, జేబ్రాండ్ మద్యం, గంజాయి వంటి వాటిని వైకాపా ఎమ్మెల్యేల ద్వారా ముఖ్యమంత్రే విక్రయిస్తున్నాడని సుజాత ఆరోపించారు. జంగారెడ్డిగూడెం మరణాలన్నీ ప్రభుత్వహత్యలేనని, ముఖ్యమంత్రి స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్తే వాస్తవాలు తెలుస్తాయని తేల్చిచెప్పారు. చనిపోయినవారిని అవమానిస్తూ ముఖ్యమంత్రే శవ రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. చంద్రబాబు జంగారెడ్డిగూడెం వెళ్తున్నాడని తెలిసి, సారా బాధిత కుటుంబాల వారిని అధికారుల సాయంతో ప్రభుత్వపెద్దలు భయభ్రాంతులకు గురిచేసింది నిజంకాదా అని నిలదీశారు.

ఇదీ చదవండి: CRIME NEWS: కుటుంబ కలహాలతో ఇద్దరు.. కరెంటు షాక్​తో మరొకరు..

ABOUT THE AUTHOR

...view details