రాష్ట్రంలో ఆలయాల రక్షణ కోరిన చంద్రబాబుపై క్రిమినల్ కేసులు పెడతానని డీజీపీ చెప్పటం విడ్డూరంగా ఉందని తెదేపా అధికార ప్రతినిధి సుధాకర్‌రెడ్డి మండిపడ్డారు. ప్రాంతాలు, కులాల గురించి ముఖ్యమంత్రి జగన్ మాట్లాడటం విధ్వేషాలు రెచ్చగొట్టటం కాదా? అని ప్రశ్నించారు. పోలీసులను కుక్కలతో పోల్చిన వైకాపా నేతలను వదిలి ప్రతిపక్షనేతను శిక్షిస్తారా? అని నిలదీశారు. డీజీపీ వైకాపా కార్యకర్తలా మాట్లాడటం మానేసి..చట్ట ప్రకారం పనిచేస్తే మంచిదని హితవు పలికారు.
వైకాపా కనుసన్నల్లో డీజీపీ విధులు
వైకాపా కనుసన్నల్లో డీజీపీ విధులు నిర్వహిస్తున్నారని నెల్లూరు జిల్లా తెదేపా నేత కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి విమర్శించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా చంద్రబాబు మాట్లాడారంటూ..కేసు పెట్టేందుకు ప్రయత్నించడాన్ని ఆయన తప్పుబట్టారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడుతున్న వైకాపా ప్రజాప్రతినిధులపై ఏ కేసు పెట్టారని ఆయన డీజీపీని ప్రశ్నించారు. డీజీపీ అధికార పార్టీకి తొత్తుగా మారి.. ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. దేవాలయాలపై జరుగుతున్న దాడుల కేసును దమ్ముంటే సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.
దేవాలయాలపై దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలం
దేవాలయాలపై దాడులు చేస్తుంటే వైకాపా ప్రభుత్వం ఎందుకు అరికట్టటంలేదని తెదేపా కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు సొమిశెట్టి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. సీఎం జగన్.. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏ రోజు ఏ దేవాలయంలో దేవతా విగ్రహాలను ధ్వంసం చేస్తారో.. అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేవాలయాలపై దాడులు పెరిగాయన్నారు.