ఇసుక సమస్యను ప్రభుత్వం పరిష్కరించలేదు కాబట్టే చంద్రబాబు దీక్ష చేస్తున్నారని... తెదేపా సీనియర్ నేత చినరాజప్ప చెప్పారు. ఇసుక సమస్య లేకుండా నాడు తాము విధానాలు మార్చుకున్నామని వివరించారు. వరదల కారణంగా ఇసుక లభ్యత లేదు అనేది అవాస్తవమన్న చినరాజప్ప... విధానం సరిగా లేకపోవడం వల్లనే ఇసుక కొరత ఏర్పడిందన్నారు. ఇసుక కొరతతో ఇబ్బంది పడిన అన్ని వర్గాలు దీక్షలో పాల్గొనాలని కోరారు.
'జేబులు నిండాయి కదా.. ఇప్పటికైనా ఉచితంగా ఇవ్వండి'
ఇసుక అక్రమ రవాణాపై ఇప్పటివరకు చట్టం ఎందుకు తేలేదని... తెలుగుదేశం పార్టీ నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పవన్‌పై మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెదేపా నేతలు చినరాజప్ప, బొండా ఉమా, బండారు సత్యనారాయణ పేర్కొన్నారు.
యూనిట్ రూ.3 వేలు ఉన్న ఇసుక రూ.40 వేలకు ఎందుకు చేరిందని బొండా ఉమా ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ఇసుక గురించి మాట్లాడితే వ్యక్తిగత దూషణలు చేస్తున్నారన్న బొండా... పవన్ లాంగ్‌మార్చ్‌కి ప్రభుత్వం వణికిపోతోందని పేర్కొన్నారు. పవన్‌పై మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు.
ఇసుక అక్రమ రవాణాపై ఇప్పటివరకు చట్టం ఎందుకు తేలేదని బండారు సత్యనారాయణ నిలదీశారు. చంద్రబాబు దీక్ష ప్రకటనతో సీఎం వీడియో గేమ్స్ నుంచి బయటకు వెళ్లారని ఎద్దేవా చేశారు. వైకాపా నేతల జేబులు నిండాయి.. ఇప్పటికైనా ఉచిత ఇసుక ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.