రాష్ట్రంలో రెండున్నరేళ్లు విచ్చలవిడిగా సాగుతున్న గంజాయి ఉత్పత్తి డీజీపీకి ఇంతకాలం కనిపించలేదా? అని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి మండిపడ్డారు. 385 మంది యువకులు 2020లో మాదకద్రవ్యాలకు బానిసలై చనిపోయారన్న ఎన్ సీఈఆర్బీ నివేదికపై డీజీపీ ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. 2018లో 196 మందిగా ఉన్న ఈ సంఖ్య జగన్ రెడ్డి ప్రభుత్వంలో రెట్టింపు అయిందని..., పోలీసు, ఎక్సైజ్ శాఖలు మాదకద్రవ్యాలను కట్టడి చేసి ఉంటే వాటి వినియోగంతో చనిపోయేవారి సంఖ్య తగ్గేదని అన్నారు. వాస్తవాలు తెలిసీ తెలియనట్లు నటిస్తున్న డీజీపీ... అధికారపార్టీని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గంజాయి సాగులో మునిగి తేలుతున్న వైకాపా నేతలు, కార్యకర్తలే గిరిజనుల్ని తమ స్వార్థానికి వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. 8వేల కోట్ల రూపాయలు విలువ చేసే గంజాయి 25వేల ఎకరాల్లో రాష్ట్రంలో సాగవుతుంటే, ఏమీ లేదని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు.
జగన్ రెడ్డి ప్రభుత్వం దోపిడికి సిద్దమైంది: కూన రవికుమార్
జగనన్న శాశ్వత గృహహక్కు పథం పేరిట పేదలు నివాసముండే సొంత ఇళ్లకు వన్ టైమ్ సెటిల్మెంట్ పేరుతో జగన్ రెడ్డి ప్రభుత్వం రూ.4800కోట్ల దోపిడీకి సిద్ధమైందని తెదేపా సీనియర్ నేత కూన రవికుమార్ మండిపడ్డారు. వన్ టైమ్ సెటిల్మెంట్ పేరిట గ్రామాల్లో రూ.10వేలు, పట్టణాల్లో రూ.15వేలు, నగరాల్లో రూ.20వేలను ప్రభుత్వం పేదల నుంచి వసూలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ ప్రభుత్వాల హయాంలో పేదలు నిర్మించుకున్న ఇళ్లపై డబ్బులు వసూలు చేసే అధికారం ముఖ్యమంత్రికి ఎవరిచ్చారని ప్రశ్నించారు.
గవర్నర్ పేరు చెప్పి వేల కోట్లు అప్పుతెచ్చుకున్న ప్రభుత్వం ఇప్పుడు ఒప్పంద పత్రాల్లో ఆ పేరు ఎలా తొలగిస్తుందని తెదేపా అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ నిలదీశారు. గవర్నర్ కు తెలియకుండా ఆయన పేరును బ్యాంకులకు తాకట్టు పెట్టి రూ.25వేల కోట్లు రుణం తీసుకోవటం దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ చేయలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి, ఆర్థికమంత్రి, ఉన్నతాధికారులకు తెలియకుండా గవర్నర్ పేరు వాడటం అసాధ్యమని ఆయన అన్నారు.
ఇదీ చదవండి:భార్యకు నిప్పంటించిన భర్త- కడుపులోని శిశువు మృతి