ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చెన్నుపాటి గాంధీపై దాడి.. జగన్‌ రెడ్డి అరాచక పాలనకు నిదర్శనం: తెదేపా - విచారణలో ప్రలోభాలు ఉండవు

TDP LEADERS FIRES: తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీపై జరిగిన దాడిని ఆ పార్టీ నేతలు ఖండించారు. తెదేపా నేతలపై జరుగుతున్న వరుస దాడులు జగన్​ ఆటవిక పాలనకు నిదర్శనమన్నారు. పార్టీ నేతలపై ప్రణాళికల ప్రకారం దాడులు చేస్తున్న పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని మండిపడ్డారు. గాంధీపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు.

LEADERS CONDEMNS THE ATTACK ON CHENNUPATI GANDHI
LEADERS CONDEMNS THE ATTACK ON CHENNUPATI GANDHI

By

Published : Sep 4, 2022, 4:03 PM IST

ATTACK ON TDP LEADER GANDHI : విజయవాడలో శనివారం వైకాపా నాయకుల దాడిలో గాయపడిన తెదేపా రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్​కు తరలించారు. పదునైన ఆయుధంతో దాడి చేయడం వల్ల ఓ కంటి చూపు పూర్తిగా కోల్పోయిందని.. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు తెలిపారు. రెండో కన్నుకు, మెదడుకు ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేందుకు ఎల్.వి ప్రసాద్ కంటి ఆసుపత్రిలో శస్త్ర చికిత్స నిర్వహించనున్నట్లు వైద్యులు వివరించారు. చెన్నుపాటి గాంధీపై దాడిని తెలుగుదేశం నేతలు ఖండించారు.

గాంధీపై దాడి జగన్​ అరాచక పాలనకు నిదర్శనం: తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీపై జరిగిన దాడి.. జగన్‌ రెడ్డి అరాచక పాలనకు నిదర్శనమని మాజీమంత్రి, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర అన్నారు. పోలీసులు సహకరించడం వల్లే వైకాపా దాడులకు తెగబడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా చేస్తున్న దాడులకు మూల్యం చెల్లించుకోక తప్పదని కొల్లు హెచ్చరించారు.

గాంధీపై దాడి అన్యాయం : తెదేపా నేత చెన్నుపాటి గాంధీపై దాడిని ఖండించిన మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లరావు ఖండించారు. గాంధీపై దాడి జగన్ ఆటవిక పాలనకు నిదర్శనమన్నారు. జగన్‌ అసమర్థ పాలన వల్లే దాడులు జరగుతున్నాయని.. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం సరికాదన్నారు. తెదేపాపై ప్రణాళిక ప్రకారం దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.

తెదేపా నేత చెన్నుపాటి గాంధీపై దాడిని తీవ్రంగా పరిగణించాలని తెదేపా నేత గద్దె రామ్మోహన్‌ స్పష్టం చేశారు. నాయకుల అండతోనే విజయవాడలో గంజాయి అమ్మకం జరుగుతుందని.. విజయవాడ గంజాయి అడ్డా కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.

విజయవాడలో ఉద్రిక్తత : విజయవాడ సెంట్రల్ ఏసీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. చెన్నుపాటి గాంధీపై దాడిచేసిన వారి అరెస్టు చేయాలని తెదేపా డిమాండ్‌ చేసింది. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ ఆధ్వర్యంలో తెదేపా శ్రేణుల ఆందోళన చేపట్టారు. కేసును తారుమారు చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారని తెదేపా ఆరోపించింది. ఇప్పటివరకూ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడాన్ని తప్పుబట్టిన తెదేపా.. చెన్నుపాటి గాంధీపైనే కేసు పెట్టే ఆలోచనలో పోలీసులు ఉన్నారని మండిపడ్డారు.

పోలీసులకు ఫిర్యాదు : చెన్నుపాటి గాంధీపై దాడి కేసును నీరుగార్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. ఈ కేసులో పారదర్శకంగా దర్యాప్తు చేసి నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలని కోరుతూ సెంట్రల్ ఏసీపీ ఖాదర్ బాషాకు..తెలుగుదేశం నేతలు వినతిపత్రం సమర్పించారు. నగరంలో వైకాపా నేత అండతోనే.. గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని.. కొందరిని గంజాయికి బానిసలు చేసి..దాడులకు ఉసిగొల్పుతున్నారని తెదేపా నేతలు ఆరోపించారు.

విచారణలో ప్రలోభాలు ఉండవు : చెన్నుపాటి గాంధీపై దాడి జరిగినట్లు తమకు ఫిర్యాదు వచ్చిందని ఏసీపీ ఖాదర్‌ బాషా తెలిపారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కేసు విచారణలో ఎలాంటి ప్రలోభాలు ఉండవని స్పష్టం చేశారు. నిష్పక్షపాతంగా దర్యాప్తును చేస్తున్నామని.. సరైన సెక్షన్లతోనే కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

చెన్నుపాటి గాంధీపై దాడిని ఖండించిన తెదేపా నేతలు

అసలేం జరిగిందంటే: విజయవాడలో తెలుగుదేశం నాయకుడు చెన్నుపాటి గాంధీపై వైకాపా శ్రేణులు దాడి చేశాయి. పటమటలంకలోని గర్ల్స్‌ హైస్కూల్ వద్ద గాంధీని వైకాపా వర్గీయులు చితక బాదారు. కంటికి తీవ్ర గాయాలు కాగా ఆయన్ను తాడిగడప ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రికి తరలించారు. వైకాపా వర్గీయులు, దేవినేని అవినాష్ మనుషులే దాడి చేశారని తెలుగుదేశం నాయకులు ఆరోపించారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో తొమ్మిదో డివిజన్ నుంచి చెన్నుపాటి గాంధీ భార్య కార్పొరేటర్​గా పోటీ చేసి గెలుపొందారు. వైకాపా నుంచి ఓడిపోయిన అభ్యర్థి మద్యం మత్తులో కావాలని గొడవ పడ్డారని.. వల్లూరు ఈశ్వర్ ప్రసాద్, వైకాపా నాయకులు గద్దె కళ్యాణ్, సుబ్బు, మరో ముగ్గురు వ్యక్తులు దాడి చేశారని తెదేపా నాయకులు ఆరోపించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details