తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. నరసరావుపేట పర్యటన నేపథ్యంలో పోలీసుల అరెస్టులను తెదేపా నేతలు తీవ్రంగా ఖండించారు. లోకేశ్ పర్యటనతో ముఖ్యమంత్రికి వణుకుపుడుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైపోయిన వారికి భరోసా కల్పించడం తప్పా? అని ప్రశ్నించిన ఆయన.. పరామర్శకు వెళ్తే ప్రభుత్వంలో ఉలుకెందుకని నిలదీశారు. నిందితుల్ని వదిలేసి.. అండగా నిలిచే తెదేపా నేతలను అరెస్టు చేయడం దుర్మార్గమని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
లోకేశ్ పర్యటిస్తే ఎందుకింతలా ఉలిక్కిపాటు: బీదా రవిచంద్ర
దిశాచట్టం ద్వారా ముగ్గురికి ఉరిశిక్ష, 20 మందికి యావజ్జీవశిక్షలు విధించామని హోంమంత్రి సుచరిత చెప్పడం హాస్యాస్పదమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర విమర్శించారు. బాధితుల కుటుంబాల పరామర్శకు నారా లోకేశ్ వెళితే ఎందుకింతలా ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు. ఏడాదైనా.. బాధితురాలికి న్యాయం చేయలేదని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ దుయ్యబట్టారు. ప్రభుత్వం అసమర్థత బయటపడుతుందనే నెపంతో లోకేశ్ పర్యటనను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. దిశ చట్టం పేరుతో ఎన్నాళ్లు మహిళలను మభ్యపెడతారని ఆమె నిలదీశారు.