తెదేపా పట్టాభి అరెస్టు, పోలీసుల తీరుపై తెలుగుదేశం నేతలు(tdp leaders on pattabhi arrest) మండిపడ్డారు. పట్టాభి ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయకుండా.. ఆయన్ని అరెస్టు చేయడం అరాచకానికి పరాకాష్ట అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాభి అరెస్టును వ్యతిరేకిస్తూ.. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు(mla gadde rammohanrao on pattabhi arrest) విజయవాడ పటమట పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. పట్టాభిని వెంటనే విడుదల చేయాలని.. లేకపోతే ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో విచారించాలని డిమాండ్ చేశారు.
కోర్టు ముందు హాజరుపరచాలి: లోకేశ్
ప్రజల్ని రక్షించే పోలీసులైతే పట్టాభిపై దాడిచేసిన వారిని అరెస్ట్ చేయాలి కానీ, దాడికి గురైన పట్టాభినే అరెస్ట్ చేశారంటే.. వీళ్లు ప్రజల కోసం పని చేసే పోలీసులు కాదని తేలిపోయిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్(on pattabhi arrest) విమర్శించారు. ఏపీలో ప్రజలు, ప్రతిపక్షనేతలకు రక్షణ లేదన్నారు. పట్టాభికి హాని తలపెట్టాలని పోలీసులు చూస్తున్నారని, పట్టాభికి ఏమైనా జరిగితే డీజీపి, ముఖ్యమంత్రిదే బాధ్యతన్నారు. తక్షణమే పట్టాభిని కోర్టు ముందు హాజరుపరచాలని డిమాండ్ చేశారు. బోస్‌డీకే అనేది రాజద్రోహం అయితే.. వైకాపా నేతల అసభ్య భాష ఏ ద్రోహం కిందకి వస్తుందో డీజీపీ చెప్పాలని ప్రశ్నించారు. డ్రగ్స్ గుట్టురట్టు చేస్తున్నారనే పట్టాభిని అదుపులోకి తీసుకున్నారని ప్రజలకు అర్థమైందన్నారు. ఎన్ని దాడులు చేసినా, ఎంత మందిని అరెస్ట్ చేసినా.. దేశానికే ముప్పుగా పరిణమించిన వైకాపా డ్రగ్స్ మాఫియా ఆట కట్టించే వరకూ తెదేపా పోరాటం ఆగదని లోకేశ్ స్పష్టం చేశారు.