TDP on NTR Health University: హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపుపై తెలుగుదేశం నేతలు భగ్గుమన్నారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపు జగన్ ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనమని చంద్రబాబు అన్నారు. 1986లో ఏర్పాటైన ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీతో వైఎస్సార్‌కు ఏం సంబంధం ఉందని చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్టీఆర్ నిర్మించిన వర్సిటీకి మీ తండ్రి పేరు ఎలా పెట్టుకుంటారన్నారు. ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఉన్న సంస్థలకు పేర్లు మార్పు కాదు... కొత్తగా నిర్మిస్తే పేరొస్తుందని చంద్రబాబు దయ్యబట్టారు.
"హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపు జగన్ ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనం. తెలుగుదేశం పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోంది. వైద్య విద్యకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలనే సంకల్పంతో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 1986లో ఈ హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి చెందిన రూ.450 కోట్ల నిధులను సైతం బలవంతంగా కాజేసిన జగన్ ప్రభుత్వం..ఏ హక్కుతో వర్సిటీ పేరు మార్చుతుంది?కనీసం స్నాతకోత్సవం నిర్వహణకు కూడా నిధులు లేకుండా చేసిన వీళ్ళు ఇప్పుడు పేరు మార్చుతారా?అసలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ కు ఏం సంబంధం ఉంది?. దశాబ్దాల నాటి సంస్థలకు ఉన్న పేర్లు మార్చి కొత్తగా మీ పేర్లు పెట్టుకుంటే మీకు పేరు రాదు సరికదా...ప్రజలు మీ దిగజారుడుతనాన్ని ఛీకొడతారు. చేతనైతే కొత్తగా సంస్థలను నిర్మించండి. ఇకనైనా ప్రభుత్వం పిచ్చి ఆలోచనలు మానుకుని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును యధావిధిగా కొనసాగించాలి." - తెదేపా అధినేత చంద్రబాబు
చరిత్ర హీనుడు జగన్‌రెడ్డి... ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయం వెనక్కి తీసుకోవాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు తుగ్లక్ చర్యని దుయ్యబట్టారు. తెలుగువారి ఆత్మగౌరవం... ఎన్టీఆర్ అని స్పష్టం చేశారు. వైఎస్‌కు హెల్త్ యూనివర్సిటీకి సంబంధం ఎంటని నిలదీశారు. హెల్త్ యూనివర్సిటీ నెలకొల్పింది, అభివృధి చేసింది ఎన్టీఆర్ అని లోకేశ్ గుర్తుచేశారు. తన చర్యలతో జగన్ చరిత్ర హీనుడుగా మిగిలిపోతారని విమర్శించారు.
"ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయం తక్షణమే వెనక్కి తీసుకోవాలి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు తుగ్లక్ చర్య. తెలుగు వారి ఆత్మగౌరవం స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ నెలకొల్పిన యూనివర్సిటీ ఇది. అసలు వైఎస్‌కి, హెల్త్ యూనివర్సిటీకి సంబంధం ఏంటి?. హెల్త్ యూనివర్సిటీ నెలకొల్పింది, అభివృద్ధి చేసింది ఎన్టీఆర్. ఈ చర్యలతో జగన్ రెడ్డి శాశ్వతంగా చరిత్రహీనుడుగా మిగిలిపోతారు."-తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
ఎన్టీఆర్ పేరు మార్చే దుస్సాహసం చేశారంటే, జగన్‌కు రోజులు దగ్గర పడినట్లేనని... పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు. వైద్య వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ ఆరోగ్య వర్సిటీకి అంకురార్పణ చేసిన ఎన్టీఆర్ పేరు ఎలా మారుస్తారని ప్రశ్నించారు. వైకాపాలో అంతర్గతంగా సీక్రెట్ ఓటింగ్ నిర్వహించినా.... జగన్ తప్పు చేశారనే విషయం అర్థమవుతుందన్నారు. ఇప్పటికైనా జగన్ పోకడలపై ప్రజలంతా నిరసన తెలపాలని... లేదంటే పుట్టే బిడ్డ నుంచి రాష్ట్రం వరకు అన్నింటికీ ఆయన పేర్లు పెట్టుకుంటారని ఆందోళన వ్యక్తంచేశారు.
శాడిస్టు ముఖ్యమంత్రికి పిచ్చికూడా పట్టింది కాబట్టే యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చారని తెదేపా శాసనసభ పక్ష ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ జోలికి వస్తే జగన్మోహన్ రెడ్డి ఇక ఇంటికే పరిమితమవుతారని ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు మండిపడ్డారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే కడప జిల్లాకు వైఎస్ పేరు తొలగించే ఆలోచన జగన్మోహన్ రెడ్డి కల్పిస్తున్నారని ఎమ్మెల్సీ అశోక్ బాబు హెచ్చరించారు. ఎన్టీఆర్ పేరుపై ఉద్యమిస్తామని మరో ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ తేల్చిచెప్పారు.