తెదేపా సీనియర్ నేత దేవినేని ఉమా అరెస్టుపై.. తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. దేవినేని ఉమాపై పోలీసులే దాడికి కుట్ర పన్నారని ఆరోపించారు. దాడి జరిగే ప్రదేశం వైపు ఉమాను దారి మళ్లించి ప్రత్యక్షంగా, పరోక్షంగా భౌతిక దాడిని సహకరించటంలో పోలీసులే కీలక పాత్ర పోషించారని పలువురు పార్టీ నేతలు ధ్వజమెత్తారు. వైకాపా అరాచకపాలన, మైనింగ్ మాఫియా, అవినీతి - అక్రమాలు - ఆగడాలకు అడుగడుగునా అడ్డుపడున్నారనే దేవినేనిని అరెస్టు చేశారని ఆక్షేపించారు.
కాపాడమంటే క్రిమినల్ కేసులు పెడతారా: తెదేపా ఎమ్మెల్యేలు
సహజ వనరులు కాపాడమంటే దేవినేని ఉమాపై హత్యాయత్నం, క్రిమినల్ కేసులు పెట్టడమేంటని తెదేపా ఎమ్మెల్యేలు.. ఏలూరి సాంబశివరావు, డోలా బాలవీరాంజనేయస్వామి, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్‌లు ధ్వజమెత్తారు. వైకాపా నేతల అవినీతిని ఉమా ప్రశ్నిస్తే హత్యాయత్నం కేసు పెట్టారని మండిపడ్డారు. అవినీతికి అడ్డొచ్చే వారిని భౌతికంగా అంతమొందించేందుకూ వెనుకాడటం లేదని విమర్శించారు. దాడిచేసిన వారిని వదిలిపెట్టి.. దేవినేనిపై ఎదురు కేసులు పెట్టడం కక్షసాధింపు చర్యలకు నిదర్శనమేనని ఆరోపణలు చేశారు. అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ చేసినవారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్లో మారణాయుధాలతో దాడిచేసినట్లు పేర్కొనడం దుర్మార్గమని ఆక్షేపించారు.
వారి లక్ష్యం నెరవేరింది: నక్కా ఆనంద్ బాబు
మాజీ మంత్రి దేవినేని ఉమాను ఎలాగైనా జైలుకు పంపాలని లక్ష్యంగా పెట్టుకున్న ముఖ్యమంత్రి కార్యాలయం కల నెరవేరిందని.. తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు దుయ్యబట్టారు. “కొండపల్లి అటవీ ప్రాంతం నుంచి వస్తున్న దేవినేని ఉమాను.. దారి మళ్లించి హత్యాయత్నం జరిగేలా కుట్ర పన్నింది పోలీసులేనని మండిపడ్డారు.
బెయిల్ కు అనుకూలంగా లేని సెక్షన్లు దేవినేని ఉమాపై పెట్టడం సిగ్గు చేటని ధ్వజమెత్తారు. వైకాపా నేతలు చెప్పిందల్లా చేస్తున్న పోలీసులు.. పూర్తి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఉమాతో పాటు 18మందిపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని మండిపడ్డారు. దేవినేని ఉమా ఫిర్యాదు తీసుకోకుండా ఆయనపైనే తప్పుడు కేసు పెట్టడం దుర్మార్గమని అన్నారు.
వారిని పెట్టుకుని ప్రతిపక్షాలపై దాడులకు తెగపడుతున్నారు: అమర్నాథ్ రెడ్డి
పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం ప్రతిపక్షాలపై దాడులకు తెగపడుతోందని.. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. దేవినేని ఉమా అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. మాజీ మంత్రికే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైకాపా నాయకుల అవినీతిని చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు.
హత్యారాజకీయాలకు చిరునామా వసంత కృష్ణ ప్రసాద్: పంచుమర్తి అనురాధ
హత్యారాజకీయాలకు చిరునామా వసంత కృష్ణ ప్రసాద్ అని.. తెదేపా నేత పంచుమర్తి అనురాధ ఆరోపించారు. కృష్ణప్రసాద్ కుటుంబం గతంలో జర్నలిస్టులను హత్యలు చేయించిందని ఆరోపణలు చేశారు. ప్రశాంతంగా ఉండే మైలవరంలో తరచూ అల్లర్లు సృష్టిస్తున్నారని విమర్శించారు. నిందితుల్ని వదిలి బాధితులపై కేసు పెట్టాలని ఏ చట్టం చెప్తోందని నిలదీశారు.
శిక్షించటం మాకూ వచ్చు: అశోక్ బాబు
అక్రమ కేసులు పెడుతున్న పోలీసులను.. చట్టపరంగా శిక్షించటం తమకూ వచ్చని ఎమ్మెల్సీ అశోక్ బాబు హెచ్చరించారు. అక్రమ మైనింగ్‌కు ఎస్సీ, ఎస్టీ కేసులకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. వైకాపా గూండాల దాడికి పోలీసులు సహకరించారని విమర్శలు చేశరు. ఉమా పై దాడి చేయించటంతో.. అక్రమమైనింగ్ కు సూత్రధారి తానేనని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఒప్పుకున్నట్లేనని అన్నారు. ఈ ముఖ్యమంత్రిని గద్దెదింపేందుకు ప్రతీ కార్యకర్తా జైలుకెళ్లేందుకు సిద్ధమేనన్నారు. వైకాపాకు సహకరిస్తున్న పోలీసులకు ప్రభుత్వం మారిన వెంటనే శిక్ష తప్పదని హెచ్చరించారు.