మాజీమంత్రి దేవినేని అరెస్ట్‌ను తెదేపా నేతలు ఖండించారు. ప్రజా సంపదను వైకాపా నేతలు దోచుకుంటుంటే అడ్డుకోవడం తప్పా అని నిలదీశారు. దేవినేనిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బాధితుల్ని నిందితుల్ని చేసిన దుర్మార్గమైన పోలీసు వ్యవస్థ ఏపీలో ఉండటం దురదృష్టకరమని లోకేశ్ విమర్శించారు.
'మీ బాస్‌కి పట్టిన గతే మీకూ పడుతుంది'
వైకాపా మైనింగ్ మాఫియా, అవినీతి, అక్రమాలకు అడుగడుగునా అడ్డుపడున్నారనే మాజీ మంత్రి దేవినేని ఉమాపై రాజారెడ్డి రాజ్యాంగం ప్రయోగించారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. దేవినేనిపై దాడిచేసిన నిందితులపై ఐపీసీ సెక్షన్లు కింద కేసులుపెట్టి, అరెస్ట్ చేయాల్సిన పోలీసులు.. తిరిగి ఉమ పైనే వైకాపా సెక్షన్ల కింద కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. బాధితుల్ని నిందితుల్ని చేసిన దుర్మార్గమైన పోలీసు వ్యవస్థ ఏపీలో ఉండటం దురదృష్టకరమన్నారు. మాజీ మంత్రినే చట్టవ్యతిరేకంగా ఇంతగా హింసిస్తుంటే.. సామాన్యుల పరిస్థితి ఇంకెంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆక్షేపించారు. చట్టాన్ని చుట్టం చేసుకున్న పోలీసులకు.. తాడేపల్లి కొంప కనుసైగలే చట్టంగా నిర్ణయాలు తీసుకుంటున్న మీ బాస్‌కి పట్టిన గతే మీకూ పడుతుందని హెచ్చరించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అన్యాయంగా వ్యవహరిస్తున్నా.. న్యాయం ముందు దోషులుగా నిలబడక తప్పదన్నారు.
'అవినీతి రాజ్యమేలుతోంది'
వైకాపా పాలనలో అవినీతి రాజ్యమేలుతోందని.. మాజీ మంత్రి, మండలిలో ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు విమర్శించారు. సహజ వనరుల దోపిడీని అడ్డుకుంటే దాడులు చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. నిందితులను వదిలేసి బాధితులను అరెస్టు చేయడం ఏంటన్నారు. వసంత కృష్ణప్రసాద్ కనుసన్నల్లోనే గ్రావెల్‌ను దోచుకు తింటున్నారని యనమల ఆరోపించారు. పోలీసు వ్యవస్థ పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి కనిపిస్తోందని.. మాజీ మంత్రి దేవినేని ఉమను వెంటనే వదిలిపెట్టి నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వైకాపా నేతల సహజవరుల దోపిడీపై తెదేపా పోరాటం ఆగదని యనమల తేల్చి చెప్పారు.
ప్రజాస్వామ్యాన్ని అడ్డగోలుగా ఖూనీ చేస్తున్నారు: నక్కా ఆనంద్ బాబు
బెయిల్‌కు అనుకూలంగా లేని సెక్షన్లు దేవినేని ఉమాపై పెట్టడం సిగ్గు చేటని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు మండిపడ్డారు. పోలీసులు పూర్తిపక్షపాతంగా వ్యవహరిస్తున్నారన్న ఆయన.. వైకాపా నేతలు చెప్పిందల్లా చేయటానికేనా పోలీసులుందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని అడ్డగోలుగా ఖూనీ చేసి ఉమాతో పాటు 18మందిపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని దుయ్యబట్టారు. దేవినేని ఉమా ఫిర్యాదు తీసుకోకుండా తప్పుడు కేసు ఆయనపైనే పెట్టించటం దుర్మార్గమన్నారు. ఉమాను లక్ష్యంగా చేసుకున్న ముఖ్యమంత్రి కార్యాలయం జైలుకు పంపాలనే తమ కలను నెరవేర్చుకుంటుందని నక్కా ఆనంద్‌బాబు ధ్వజమెత్తారు.
'వైకాపా ఆగడాలు మితిమీరిపోతున్నాయి..'
దేవినేని ఉమపై దాడిని ఖండించిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.. వైకాపా నేతల అరాచకాలు, ఆగడాలు మితిమీరిపోతున్నాయి మండిపడ్డారు. అక్రమాల పరిశీలనకు వెళ్తే దాడికి పాల్పడటం దుర్మార్గమని అన్నారు. అరాచక ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
దాడి.. పిరికిపింద చర్య..
దేవినేని ఉమామహేశ్వరరావుపై దాడి అమానుషమని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప మండిపడ్డారు. వైకాపా గూండా రాజకీయాలు చేస్తోందన్నారు. ఒక్కరిపై 100 మంది వైకాపా గూండాల దాడి పిరికిపింద చర్య అని వ్యాఖ్యానించారు. కొండపల్లి ఫారెస్టులో... స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రోద్బలంతోనే దేవినేని ఉమపై దాడి జరిగిందని ఆరోపించారు. వైకాపా కార్యకర్తలను అడ్డుకోవాల్సి వస్తుందన్న భయంతో.. దాడి జరుగుతున్నా పోలీసులు ఘటనా స్థలానికి రాలేదన్నారు. అవినీతి, అక్రమాలను అడ్డుకుంటే దాడులకు పాల్పడతారా అని ప్రశ్నించారు. ప్రజా సంపదను వైకాపా నేతలు దోచుకుంటుంటే ప్రజల తరపున తెలుగుదేశం నేతలు అడ్డుకోవడం తప్పా అని నిలదీశారు. రాష్ట్రంలో ఒక మాజీ మంత్రికే రక్షణ లేదంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటన్నారు. మైనింగ్‌ను అడ్డుకుంటే హత్యాయత్నాలు, బెదిరింపులకు పాల్పడుతారా అని ధ్వజమెత్తారు.
' అక్రమ దందాలను ఎండగడతాం'
వైకాపా నేతల దోపిడీ ప్రజలకు చూపిస్తే అది హత్యాయత్నమం ఎలా అవుతుందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు నిలదీశారు. “వైకాపా దొంగలు రాష్ట్రాన్ని బందిపోటు దొంగలకు మించిన స్థాయిలో దోచుకుంటున్నారు. అక్రమ మైనింగ్ దందాను బట్టబయలు చేసిన దేవినేని ఉమాపై వైకాపా నేతల దాదాగిరిని ఖండిస్తున్నానని.. తన దోపిడీ బయటకు రావటంతోనే కిరాయి గూండాలను పోగేసుకుని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. వైకాపా నేతలు దేవినేని ఉమాపై చేసిన హత్యాయత్నాన్ని డీజీపీ భావ ప్రకటన స్వేచ్ఛ అంటారా ప్రశ్నించారు. ప్రజా కోర్టులో వైకాపా అవినీతి, అక్రమ దందాలను ఎండగడతాం.“ అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
'పోలీసు వ్యవస్థపై నమ్మకం పోయేలా...'
అక్రమ మైనింగ్‌పై ప్రశ్నించిన దేవినేనిపై దాడి హేయమైన చర్య అని తెదేపా నేత మండలి బుద్ధప్రసాద్ విమర్శించారు. అక్రమాలపై ప్రశ్నించడం ప్రతిపక్షాల బాధ్యత అని చెప్పారు. పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి కొమ్ము కాస్తోందని ఆరోపించారు. పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం లేకుండా చేస్తున్నారని.. ప్రతిపక్షాలను సీఎం అణచివేస్తున్నారని మండిపడ్డారు.
'ప్రతి పోలీస్‌కు శిక్షతప్పదు..'
అక్రమ మైనింగ్ పరిశీలనకు వెళ్లిన వ్యక్తిపై ఎస్సీఎస్టీ కేసు ఎలా పెట్టారని ఎమ్మెల్సీ అశోక్ బాబు నిలదీశారు. వైకాపా గూండాల దాడికి పోలీసులు దగ్గరుండి సహకరించారని ఆరోపించారు. దేవినేని ఉమాని ఇచ్చిన ఫిర్యాదు తీసుకోకుండా పోలీసులే అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. ఈ ముఖ్యమంత్రిని గద్దె దింపే వరకు ప్రతి తెదేపా కార్యకర్త ఎన్నాళ్లు జైళ్లల్లో ఉండటానికైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. 2024 లో తెదేపా ప్రభుత్వం వచ్చిన మరుక్షణం వైకాపా ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్న ప్రతి పోలీస్‌కు శిక్షతప్పదని హెచ్చరించారు. చట్టపరంగా పోలీసులను ఎలా శిక్షించాలో తమకు బాగా తెలుసన్నారు.