Kala Venkat Rao on YSRCP: జగన్ రెడ్డి - పెద్దిరెడ్డి స్వార్థానికి కృష్ణపట్నం ప్లాంటు బలైందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు ధ్వజమెత్తారు. కృష్ణపట్నంలో 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి గండి పడిందన్న ఆయన.. దీనికి బాధ్యతవహిస్తూ విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒకవైపు విద్యుత్ కోతలు.. మరోవైపు ఛార్జీల మోతలు మోగిస్తున్నారని.. దీనికి జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి అవినీతే కారణమని ఆరోపించారు.
చంద్రబాబు హయాంలోనే 2,400 మెగావాట్ల సామర్థ్యంతో కృష్ణపట్నం ప్లాంటు నిర్మాణం చేశారని.. 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అప్పుడే ప్రారంభమైందన్నారు. తెదేపా హయాంలోనే మూడవ యూనిట్ నిర్మాణ పనులు పూర్తయ్యాయని.. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా మూడో యూనిట్ ప్రారంభించలేదని కళా వెంకట్రావు విమర్శించారు. కాంట్రాక్టుల పేరుతో కమిషన్లు దండుకోవడం తప్ప, అభివృద్ధి చేసిందేమీ లేదని మండిపడ్డారు. ఎంపీ అవినాశ్ రెడ్డి బినామీలకు సోలార్ విద్యుత్ కట్టబెట్టేందుకు ధర్మల్ విద్యుత్ ప్లాంటు ధ్వంసమైందన్నారు. కృష్ణపట్నం ప్లాంటులో అవకతవకలపై జ్యుడీషియల్ విచారణ జరపాలని, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రాజీనామా చేయాలని కళావెంకట్రావు డిమాండ్ చేశారు.
Kollu Ravindra Fire on CM Jagan:వైకాపా మూడేళ్లలో రాష్ట్రంలో 37మంది తెలుగుదేశం కార్యకర్తలను పొట్టన పెట్టుకుంటే.. వారిలో 26మంది బీసీలే ఉన్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. మాచర్లలో జల్లయ్య హత్య ముమ్మూటికి వైకాపా ప్రభుత్వ హత్యేనని ఆయన ఆరోపించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా తెదేపా నేతల్ని, బీసీ సంఘాల నేతల్ని గృహనిర్భంధం చేయటం దుర్మార్గమన్నారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన స్వార్థం కోసం పల్నాడును వల్లకాడుగా మార్చారన్నారు. జగన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ బీసీలపై మారణహోమంసాగిస్తూ.. ఆర్థిక, సామాజిక, రాజకీయంగా వాళ్లను అనగదొక్కుతున్నారన్నారు. '10 మందికి మంత్రి పదవులు ఇచ్చి 100 మంది బీసీల ప్రాణాలు తీయం సామాజిక న్యాయమా' అని కొల్లు రవీంద్ర నిలదీశారు.
Ayyanna patrudu on Alluri Jayanthi: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 వేడుకలను ఉమ్మడి జిల్లా విశాఖలో నిర్వహించాలని.. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలని తెదేపా పోలిట్ బ్యూరో సభ్యుడు మాజీమంత్రి అయ్యన్న పాత్రుడు కోరారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని ఓ వీడియో విడుదల చేశారు. జయంతి ఉత్సవాలు ఈనెల 21 నుంచి వచ్చే నెల 4 వరకు నిర్వహించేందుకు అధికారంగా సన్నాహాలు చేస్తున్న తరుణంలో ఆలోచన చేయాలని అయ్యన్న పాత్రుడు అన్నారు. సీతారామరాజు.. పుట్టి నడయాడిన ప్రాంతాలైన పాంద్రంగి, రాజేంద్రపాలెం, కృష్ణదేవిపేట పరిధిలో వేడుక జరిపితే అందరికీ శ్రేయస్కరంగా ఉంటుందన్నారు. 125 జయంతి ఉత్సవాల్లో భాగంగా సుభాష్ చంద్రబోస్ పేరుతో నాణెం విడుదల చేశారు. అదే రీతిలో అల్లూరి సీతారామరాజు పేరుతోనూ నాణెం విడుదల చేయాలన్నారు. అల్లూరి జయంతి ఉత్సవాలు నేపథ్యంలో అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.
ఇదీ చదవండి: