3.60లక్షల మంది ఓటుహక్కు కోల్పోయారు: పట్టాభి
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సమగ్ర ఓటర్ల జాబితా తయారు చేయకపోవటంతో 3.60 లక్షల మంది ఓటుహక్కు కోల్పోయారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మండిపడ్డారు. 'సవరించిన ఓటర్ల జాబితాను, ప్రభుత్వం కోర్టుకి, ఎస్ఈసీకి సమర్పించకపోవడం పెద్ద నేరం. దీనికి కారకులైన వారిపై ఎన్నికల కమిషనర్ చర్యలుతీసుకుంటే ప్రభుత్వ పెద్దలెలా తప్పుపడతారు. హైకోర్టు తీర్పు ఉల్లంఘించిన అధికారులపై ఎస్ఈసీ చర్యలు తీసుకుంటే, మంత్రి వారిని వెనకేసుకురావటమేంటి. జరిగిన తప్పుకి మంత్రి పెద్దిరెడ్డి బాధ్యతవహిస్తారా? ఎస్ఈసీ చర్యలు తీసుకున్న అధికారులకు పదోన్నతలు కల్పిస్తామని చెప్పి కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారు. దీనిపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేశాం. న్యాయస్థానం తీర్పునకు వ్యతిరేకంగా, రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడిన పెద్దిరెడ్డిని తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. ఏకగ్రీవమైన పంచాయతీలకు ఇచ్చే నగదు ప్రోత్సాహకాలను జగన్ ప్రభుత్వం రూ.7లక్షల నుంచి 5 లక్షలకు తగ్గించింది. ఎప్పటినుంచో అమల్లో ఉన్న ప్రోత్సాహకాలను తమ ఘనతగా జగన్ ప్రభుత్వం చెప్పుకుంటోంది.' అని విమర్శించారు.
మీ ప్రోత్సాహకాలు ఎప్పుడు వస్తాయి: గోరంట్ల
'అధికారిక వేలంపాటలో పాల్గొనండి' అనే రీతిలో ఏకగ్రీవాలపై ప్రభుత్వ వ్యవహారం ఉందని తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. ప్రభుత్వం ప్రకటిస్తున్న ప్రోత్సాహకాలు ఎప్పుడు వస్తాయో ఎవరికీ తెలీదని విమర్శించారు. 'కోట్లు గుమ్మరించి ప్రభుత్వం ప్రకటనలు ఇస్తోంది. కనీసం అక్కడ 'తెలంగాణా'బొమ్మ కాకుండా ఆంధ్రప్రదేశ్ బొమ్మని పెట్టండి మహా ప్రభో.' అని ట్విట్టర్లో ఎద్దేవా చేశారు. 'సర్పంచ్ సీటుకి 50 లచ్చలు అంట కదా! నామినేషన్ వెయ్యలా లేక సర్పంచ్ పోస్ట్‌ని ఇంటికే పంపిస్తారా?' అని ధ్వజమెత్తారు.
చనిపోయిన 7150 మందికి జగన్ రెడ్డి బాధ్యత వహిస్తారా?: అయ్యన్నపాత్రుడు
రాష్ట్రంలో ఇప్పటి వరకూ కరోనాతో చనిపోయిన 7150 మందికి జగన్ రెడ్డి బాధ్యత వహిస్తారా? అని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు ట్విట్టర్ వేదికగా నిలదీశారు. 'కరోనాతో ప్రజలు ఇబ్బంది పడితే నిమ్మగడ్డదే బాధ్యత అంటున్న అతి మేధావి విజయసాయిరెడ్డికి నా సూటి ప్రశ్న. రాష్ట్రంలో 8.87లక్షల మంది కరోనాతో ఇబ్బంది పడ్డారు. దీనికి జగన్ రెడ్డి బాధ్యత తీసుకుంటారా? మీ లెక్కల్లోనే ఇవి ప్రభుత్వ హత్యలు కాబట్టి 7,150 కుటుంబాలకు 50 లక్షలు ఆర్థిక సహాయం చేసి ప్రభుత్వం ఆదుకుంటుందా? ఎన్నికలకు భయపడటం లేదు అన్న నీ ప్రకటనలోనే భయం కనిపిస్తోంది." అని ట్వీట్ చేశారు.