12 మందిని చంపి, వందల మందిని ఆసుపత్రి పాల్జేసిన ఎల్జీ యాజమాన్యంతో ప్రభుత్వం ఎందుకు లాలూచీ పడిందని తెదేపా నేత అయ్యన్నపాత్రుడు నిలదీశారు. కంపెనీ ప్రతినిధులను ఎందుకు వదిలేశారని తానూ నిలదీస్తున్నట్లు ప్రకటించారు. ఇదే విషయంపై రంగనాయకమ్మ లాగా తానూ ప్రశ్నిస్తున్నాను, సీఐడీ నోటీసులు తనకూ ఇవ్వడంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. గ్యాస్‌లీక్ చేసి 12 మందిని పొట్టనబెట్టుకున్నప్పుడు సీఐడీ ఏమైందని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. వందలమంది ఊపిరాడక ఆస్పత్రిలో చేరితే సీఐడీ రాలేదన్న ఆయన ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని మృతుల తరఫున ఓ బాధ్యత కలిగిన మహిళ ప్రశ్నిస్తే మాత్రం వచ్చి నోటీసులివ్వడానికి చట్టమేమైనా ఎల్జీకి చుట్టమా అని ట్విట్టర్‌లో విమర్శలు సంధించారు.
సోషల్ మీడియాలో పోస్టుపెట్టిన 66 ఏళ్ల రంగనాయకమ్మపై అక్రమకేసు పెట్టారంటూ మాజీమంత్రి దేవినేని ఉమ ధ్వజమెత్తారు. సోషల్ మీడియా పోస్టులకే జగన్ భయపడి చస్తున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. మార్ఫింగు లేకుండా ఫేక్ కాకుండా సూటిగా ఒక మహిళ అడిగిన ప్రశ్నలకు ఏ రకంగా సీఐడీతో నోటీసులు ఇప్పించారని నిలదీశారు. ప్రశ్నిస్తే జడుసుకుని రంగనాయకమ్మ అరెస్టుకు సీఐడీని దింపి తాను పులికాదు, పులకేశి అని జగన్ నిరూపించుకున్నాడని మాజీమంత్రి అమర్‌నాథ్ రెడ్డి విమర్శించారు. ఏపీ పోలీసులు ప్రజల కోసం కాకుండా ప్రభుత్వం కోసమే పనిచేస్తున్నారని తెదేపా సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి ధ్వజమెత్తారు.