TDP Leaders On Power Cut:ముఖ్యమంత్రి జగన్ అసమర్థ పాలన వల్ల రాష్ట్రంలో విద్యుత్ కోతలు మెుదలయ్యాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. విద్యుత్ వ్యవస్థను ముఖ్యమంత్రి భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. జగన్ చేతకానితనం వల్ల 3,200 మెగావాట్ల విద్యుత్ సంక్షోభం ఏర్పడిందని అన్నారు. ఫిబ్రవరిలోనే ఈ పరిస్థితి ఉంటే రానున్న వేసవి కాలంలో విద్యుత్ కోతలు ఏ విధంగా ఉంటాయో అర్థమవుతోందన్నారు. జగన్ తన అహంకారపూరిత వైఖరి కారణంగా రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టారని దేవినేని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో అంధకారానికి జగన్ అసమర్థతే కారణం: ఎమ్మెల్యే ఏలూరి
రాష్ట్రంలో జగన్నన్న విద్యుత్ కోతల పథకం ప్రారంభమైందని.. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఎద్దేవా చేశారు. అప్రకటిత విద్యుత్ కోతల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన మండిపడ్డారు. సీఎం చేతకాని తనం వల్ల విద్యుత్ రంగం కుప్పకూలిందని సాంబశివరావు ఆరోపించారు.