నాటుసారా మరణాలు, కల్తీ మద్యంపై ఎక్సైజ్ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు తెదేపా ప్రజాప్రతినిధులు చేపట్టిన కార్యక్రమం పోలీసుల అత్యుత్సాహంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తమ అరెస్టుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్టేషన్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నాటు సారా మరణాలపై విచారణకు డిమాండు చేస్తూ బుధవారం విజయవాడ ప్రసాదంపాడులో ఉన్న ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు తెదేపా నేతలు పిలుపునిచ్చారు. మధ్యాహ్నం తర్వాత తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బస్సులో పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి బయలుదేరి వచ్చారు.
అచ్చెన్నాయుడి ఆధ్వర్యంలో 15 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రావడంతో వారిని ప్రసాదంపాడు జాతీయ రహదారిపైనే నిలిపివేశారు. అక్కడి నుంచి ఎమ్మెల్యేలు కొంతదూరం నడిచి కమిషనర్ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడా అడ్డుకున్నారు. మద్యం సీసాలకు తాళిబొట్లు కట్టి ఎమ్మెల్యే రామానాయుడు, ఫ్లకార్డులతో మిగిలినవారు వచ్చారు. అక్కడ ఎమ్మెల్యేలతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. కార్యక్రమానికి అనుమతి లేదని డీసీపీ స్పష్టం చేశారు. వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చామని పయ్యావుల కేశవ్ చెప్పగా, వేరే కారణాలు ఉన్నాయంటూ డీసీపీ వాదనకు దిగారు. కనీసం ఒక్కరినైనా పంపాలని ఎమ్మెల్యేలు డిమాండు చేశారు.
కమిషనర్ కార్యాలయంలో లేరని డీసీపీ చెప్పారు. ఎవరో ఒక అధికారికి ఇస్తామన్నా అంగీకరించలేదు. దాంతో కార్యకర్తలు పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్సీలను ముందుగానే ఉంగుటూరు పోలీసుస్టేషన్‌కు తరలించి, తర్వాత ఎమ్మెల్యేలనూ అరెస్టు చేస్తున్నట్లు డీసీపీ ప్రకటించారు. కమిషనర్ కార్యాలయం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని అరెస్టుచేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా సామాన్యులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక మహిళ కానూరులో తన కార్యాలయానికి వెళ్తుండగా ఆమెను అరెస్టు చేశారు.
పోలీసుస్టేషన్‌లో నిరసన..:ప్రసాదంపాడు నుంచి ఉంగుటూరు స్టేషన్‌కు 15 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తరలించారు. సొంత పూచీకత్తుపై సంతకాలు చేస్తే వదిలేస్తామని పోలీసులు చెప్పగా తాము నేరం చేయలేదంటూ సంతకాలు చేసేందుకు తిరస్కరించి నేలమీద బైఠాయించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఉంగుటూరుకు వచ్చి ఎమ్మెల్యేలను, నేతలను పరామర్శించారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఎమ్మెల్యేలతో ఫోన్లో మాట్లాడారు. సంతకాలు పెట్టవద్దని, అవసరమైతే తాను వచ్చి స్టేషన్ ముందు బైఠాయిస్తానని చెప్పారు. ఇదే విషయాన్ని ఎమ్మెల్యేలు పోలీసులకు తెలిపారు. తీవ్ర తర్జనభర్జన మధ్య రాత్రి ఏడు గంటలకు వారిని సంతకాలు తీసుకోకుండానే స్టేషన్ నుంచి పంపించారు.