TDP leaders: తెదేపా నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గృహనిర్భంధాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. తెదేపా కార్యకర్త రాజారెడ్డిపై వైకాపా గూండాల దాడిని ప్రశ్నించిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గృహ నిర్బంధించడం దుర్మార్గమన్నారు. నిరసన వ్యక్తం చేసిన వారిపై లాఠీఛార్జీ చేయడం రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. వైకాపా అవినీతిని ప్రశ్నించిన వారిని లక్ష్యంగా చేసుకుని జగన్ రెడ్డి తెదేపా నేతలపై గూండాయిజం చేస్తున్నారని ఆరోపించారు. ఎవరెంత బెదిరింపులకు పాల్పడ్డా, వైకాపా విధ్వంస విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
ప్రభుత్వం సమాధానం చెప్పాలి: ప్రజాభిప్రాయాలకు విరుద్ధంగా జిల్లాల విభజన ఎందుకు చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని తెదేపా ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే జిల్లాల విభజన చేశారన్నది స్పష్టమవుతోందన్నారు. జిల్లా కేంద్రం సమాన దూరంలో ప్రజలకు అందుబాటులో ఉండేలా చూశామంటున్న వైకాపా నేతలు, రాజధాని అమరావతి అలానే ఏర్పాటైందని గుర్తించాలన్నారు. రాజకీయ కోణంలో చేసిన ఆశాస్త్రీయ విభజన తప్పుల్ని తెదేపా అధికారంలోకి రాగానే పరిష్కరిస్తుందని రవిచంద్రయాదవ్ స్పష్టంచేశారు.